తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు క్లాస్ తీసుకున్నారు. ఏ ఒక్క ఎమ్మెల్యే వల్ల పార్టీకి, తనకు చెడ్డపేరు వస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయంలో నేతలకు స్పష్టత ఉండాలని మందలించారు. పార్టీ నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీలను గౌరవించాలని అన్నారు. ఈరోజు(శుక్రవారం) తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... ఎంపీలు, ఎమ్మెల్యేలను కలుపుకుని పోవాలని అన్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు కేడర్‌ను పట్టించుకోవడం లేదని అన్నారు. కేడర్‌నీ నిర్లక్ష్యం చేస్తున్నారని.. తన దగ్గర అన్ని వివరాలు ఉన్నాయని చెప్పారు. ఏ వ్యక్తి కూడా పార్టీ, కేడర్ లేకుండా గెలవలేరని ఎం చంద్రబాబు అన్నారు. ‘పార్టీ ఇచ్చిన విజయం మీది. పార్టీ వద్దు అనుకునే వారు ఇండిపెండెంట్‌గా గెలవాలి.పార్టీని రీస్ట్రక్చర్ చేసిన ప్రతిసారీ కార్యకర్తలు అర్థం చేసుకుని మద్దతుగా నిలిచారు. కార్యకర్తలు అధిష్ఠానం నిర్ణయాలకు మద్దతు పలికారు. పార్టీ ద్వారా గెలిచిన వారు పార్టీ సిద్దాంతాలు, నిర్ణయాలకు కట్టుబడి పనిచేయాలి. పొలిటికల్ గవర్నరెన్స్ అంటే ప్రజలకు చేసే మంచిలో మనం భాగస్వాములుగా ఉండటం. పార్టీని క్యారీ చేయాలి. పబ్లిక్‌ను కన్విన్స్ చేయాలి. ఇది జరగకపోవడంతోనే గతంలో నష్టం జరిగింది. తప్పు చేసిన వారిని చట్టబద్దంగా శిక్షిద్దాం. ఇష్టం వచ్చినట్లు అరెస్టులు జరగాలి అంటే కుదరదు. అది నా విధానం కాదు. చెడ్డపేరు తెచ్చుకునేందుకు మాత్రం నేను సిద్ధంగా లేను. ఇసుక విషయంలో ఎవరు వేలు పెట్టవద్దు....ఇసుక విషయంలో తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పా. ఇసుక విధానం సక్రమంగా అమలు కాకపోతే అధికారులను కూడా బాధ్యులను చేస్తా. అధికారులు నిబంధనల అమల్లో కఠినంగా ఉండాలి అని హెచ్చరించారు.