ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తీసుకున్న మరో నిర్ణయాన్ని రద్దు చేసినట్లు సమాచారం. విశాఖపట్నంలో శారదా పీఠానికి గత ప్రభుత్వ హయాంలో స్థలం కేటాయించారు. అయితే ఆ అనుమతిని టీడీపీ కూటమి సర్కారు రద్దు చేసినట్లు తెలిసింది. రూ.220 కోట్లు విలువైన 15 ఎకరాల స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వం.. శారదా పీఠానికి కేవలం రూ.15 లక్షలకే కేటాయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు జరిపించిన ఏపీ ప్రభుత్వం.. స్థలం కేటాయిస్తూ ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం సోమవారం రానుంది. ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చేలా ఉన్న ఈ అనుమతులను రద్దుచేయాలని చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం .
మరోవైపు తిరుమలలో శారదా పీఠం నిర్మాణాలపైనా ప్రభుత్వం ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనిపై చర్యలు తీసుకోవాలని టీటీడీని ఆదేశించనున్నట్లు తెలిసింది. తిరుమలలో శారదా పీఠం నిర్మాణంపై పలు సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నాలుగు అంతస్తులకు అనుమతి ఇస్తే ఆరు అంతస్తుల్లో శారదాపీఠం నిర్మాణాలు జరుపుతోందని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది జూన్‌లోనూ దీనిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్తు అధ్యక్షుడు, ఆనందాశ్రమ పీఠాధిపతి స్వామి శ్రీనివాసానంద సరస్వతి ఇది అక్రమ నిర్మాణమంటూ అప్పట్లో ఆందోళన కూడా చేశారు. పలువురు సాధువులతో కలిసి భవనాన్ని పరిశీలించిన ఆయన.. వాగును ఆక్రమించి భవనాన్ని కడుతున్నారని..భవంతిని కూల్చేయాలని డిమాండ్ కూడా చేశారు. అయితే ఈ వ్యవహారంలో కోర్టులో ఉందని అప్పట్లో టీటీడీ తెలిపింది.
మరోవైపు విశాఖలోని శారదా పీఠాన్ని వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా పలువురు రాజకీయ నాయకులు అప్పుడప్పుడూ సందర్శిస్తూ ఉంటారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతికి, వైఎస్ జగన్‌కు మధ్య సాన్నిహిత్యం ఉంది. అలాగే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా విశాఖ శారద పీఠాన్ని ఒకట్రెండుసార్లు సందర్శించారు. ఇక వైసీపీ ప్రభుత్వం హయాంలో స్వరూపానందేంద్ర సరస్వతి భద్రత కోసం 2+2 గన్‌మెన్, ఎస్కార్ట్ వాహనంతో పాటుగా 15 మంది సిబ్బందిని కూడా కేటాయించారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సెక్యూరిటీని కుదించింది. స్వరూపానందేంద్ర సరస్వతి వ్యక్తిగత భద్రత కోసం ఒక్క పోలీసును నియమించింది.