గత వైసీపీ ప్రభుత్వ పాలనపై, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో శాంతి భద్రతలు పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఏ ముఖ్యమంత్రి చేయని దుర్మార్గపు పనులు గత ఐదేళ్లలో జగన్ చేశారని విమర్శించారు. అందుకే ప్రజలు వైసీపీని 11 సీట్లకి పరిమితం చేశారని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తరువాత శాంతి భద్రతలు పటిష్టం చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ నాయకులు దుర్మార్గపు పనులు చేసి తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ముంబాయి హీరోయిన్‌ను తీసుకువచ్చి పోలీసులతో వేధించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంకా కొంతమంది నుంచి ఆ వాసన పోలేదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రంలో అన్ని రంగాల నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని.. 20 ఏళ్ళ క్రితమే ముందు చూపుతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెక్నాలజీని అభివృద్ధి చేశారన్నారు. విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకు చంద్రబాబు పని చేస్తున్నారన్నారు. వైసీపీ చేసే కుట్రల్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పీపీఏలను రద్దు చేసి గత ప్రభుత్వంలో బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేశారని.. విద్యుత్ సంస్థలు వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాయని తెలిపారు. ఆ భారమే ఇప్పుడు ప్రజలు మోస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఒక్కరూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో జగన్ చేసిన అరాచకాల వలన రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు సర్వనాశనం అయ్యాయన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిందన్నారు. చంద్రబాబు సీఎం అయిన మొదటి రోజు నుంచే రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు పని చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.