మాచర్ల , దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ద్వారకాపురి పట్టణం సుమారు వంద ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో సగభాగం బుగ్గవాగు రిజర్వాయర్లో మునిగిపోగా, మిగిలిన సగభాగం వ్యవసాయ భూమిగా మారింది. వ్యవసాయ భూమిలో ఎక్కడ చూసినా పగిలిపోయిన కుండ పెంకులు, గాజు ముక్కలు కనిపిస్తుంటాయి. అంగుళానికి ఈ కుండపెంకులు విస్తరించి కనిపిస్తున్నాయి. దుక్కి దున్నుతున్నప్పుడు మట్టి కుండలు, పిడతలు పైకి రావడం సర్వసాధారణం. పొలం గట్లపై దేవతామూర్తుల విగ్రహాలు పడి దర్శనమిస్తాయి. వీటిలో నాగ దేవత, వినాయకుడు, గజలక్ష్మి, ఏనుగును అదిరోహించిన వీరవనిత తదితర విగ్రహాలు ఉన్నాయి. చేనేత వస్త్రాలకు రంగులు తయారుచేసే ఒక యూనిట్ ఈనాటికీ శిదిలావస్థలో అక్కడ దర్శనమిస్తుంది. ప్రాంతంలో కొంతభాగాన్ని నాగులకట్ట, మరి కొంత బాగాన్ని కుమ్మరి గుట్ట అని పిలుస్తుంటారు.
ఈ భూములను సాగు చేస్తున్న రైతులకు తరచూ బంగారు నాణాలు, ఆభరణాలు ఇప్పటికీ లభిస్తున్నాయి. ఇక్కడ నాలుగు శిథిలాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఊరికి పక్కన నిరంతరం నీరు ప్రవహించే బుగ్గవాగు ఉండగా, వాగుకు ఆవలవైన బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం మెట్లకు దిగువ భాగాన పాతాళగంగా నిరంతరం భూమిపైకి పొంగుతూ ఉంటుంది. ఆ నీరు ఆనాటి ద్వారకాపురి పట్టణ వాసుల సాగు, తాగునీటి అవసరాలను తీర్చేది. 1964లో నిర్మించిన బుగ్గవాగు రిజర్వాయర్ వల్ల బుగ్గమల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు భూమిపైకి ఉబికి వచ్చే పాతళగంగ కూడా మునిగి ఉనికి కోల్పోయాయి.శిథిల ఆలయం ముందు కనిపిస్తున్న శిలాశాసనంలో ఓరుగల్లు రాజుల ప్రసక్తి ఉంది. దీన్ని బట్టి 12వ శతాబ్దంలో ఈ పట్టణం విలసిల్లినట్లు ఊహించవచ్చు. వైభవ ప్రాభవాన్ని అనుభవించిన ఆ పట్టణం ఎందుకు శిథిలస్థితికి చేరిందో ఇప్పటికీ అర్ధం కాదు. ఆనాటి ముస్లిం రాజుల దండయాత్ర వల్లనో, లేక ప్రకృతి వైపరీత్యాల కారణంగానో ద్వారకావురి విధ్వంసానికి గురై ఉండవచ్చు. అయితే స్థానికులు మరో కథనం చెబుతుంటారు. శ్రీశైలం అడవుల్లో నివసించే చెంచు తెగల దాడి వల్లనే ఈ పట్టణం ధ్వంసమైందని ఈ ప్రాంత వాసులు విశ్వసిస్తున్నారు. వారి కథనం ప్రకారం.. చెంచు తెగకు చెందిన ఓ మహిళ తేనె అమ్మడానికి తన కుక్కతో ఈ పట్టణానికి వచ్చింది. ఓ ఇంట్లో తేనె విక్రయిస్తుండగా అక్కడ తిరుగుతున్న పిల్లిని చూసి ఆ కుక్క దానిపై దాడి చేసి చంపింది.ఈ విషయమై ఆ చెంచు మహిళకు కుటుంబ సభ్యులకు ఘర్షణ జరిగి చివరకు ఆ తేనే అమ్ముకునే మహిళ హత్యకు దారితీసింది. ఆమె హత్య విషయం తెలుసుకున్న చెంచులు ప్రతీకారంతో రగిలిపోయారు. రాత్రికి రాత్రే ద్వారకాపురి పట్టణంపై దాడి చేసి మగ వారి గొంతులు కోశారని, ఈ దాడితో పట్టణం శవాల గుట్టలతో శ్మశానంగా మారిందని చెబుతుంటారు. మగ దిక్కు కోల్పోయిన మహిళలంతా పట్టణం వీడిపోగా, తప్పించుకున్న మగవారు కొన్నాళ్లకు తిరిగివచ్చారు. వారిలో కొందరు దర్మవరంలో అంతర్భాగంగా ఉన్న దారివేముల గ్రామాన్ని ఏర్పరుచుకోగా.. కొందరు దుర్గి ప్రాంతానికి వచ్చి నేటి దుర్గి గ్రామాన్ని నిర్మించుకున్నారు.