సనాతన ధర్మంపై గతంలో చేసిన వ్యాఖ్యల విషయంలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వెనక్కి తగ్గడం లేదు. సనాతన ధర్మంపై తాను చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అంతేకాకుండా ఈ విషయంలో తాను ఎవరికీ క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో న్యాయ పోరాటానికైనా సిద్ధమే కానీ.. క్షమాపణలు చెప్పేదే లేదని మరోసారి తేల్చి చెప్పారు. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను ఇటీవల పరోక్షంగా ప్రస్తావించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సోమవారం దిండిగల్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా వైరస్ వంటిదని.. దాన్ని నివారించాలని తాను గతంలో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పబోనని స్పష్టం చేశారు. మహిళలపై జరిగిన అణచివేత పద్ధతులను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వివరణ ఇచ్చారు. అయితే ఈ సందర్భంగా తాను సనాతన ధర్మంపై చేసిన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని ఉదయనిధి స్టాలిన్ తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని.. ఇప్పటికే తనపై దేశవ్యాప్తంగా ఎన్నో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు అయ్యాయని.. వాటిపై తాను న్యాయ పోరాటానికి కూడా సిద్ధమేనని ఉదయనిధి స్టాలిన్ స్పష్టం చేశారు.
అంతేకాకుండా సనాతన ధర్మంపై పెరియార్.. మాజీ ముఖ్యమంత్రులు సీఎన్ అన్నాదురై, ఎం కరుణానిధి వంటి ద్రవిడ నాయకుల అభిప్రాయాలను తాను మరోసాలి నొక్కి చెప్పినట్లు ఉదయనిధి స్టాలిన్ వెల్లడించారు. సనాతన ధర్మంలో మహిళలను చదువుకోవడానికి అనుమతించలేదని.. వారు తమ ఇళ్లను వదిలి వెళ్లలేకపోయారని.. ఒకవేళ భర్త చనిపోతే వారు కూడా చనిపోవాలని ఉందని.. వాటన్నింటికీ వ్యతిరేకంగా పెరియార్, అన్నాదురై, కరుణానిధి చెప్పిందే తాను చెప్పినట్లు తమిళనాడు డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.
ఇక గతేడాది ఓ సమావేశంలో పాల్గొన్న తమిళనాడు డిప్యూటీ ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్.. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి కారణం అయ్యాయి. సనాతన ధర్మం అనేది మలేరియా, డెంగీ లాంటిదని.. దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ ఒక ప్రసంగంలో పిలుపునిచ్చారు. అయితే ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. మరికొందరు కోర్టులను ఆశ్రయించారు. ఇక ఇటీవల తిరుపతిలో వారాహి బహిరంగ సభ నిర్వహించిన జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావించారు.