కాదేదీ నకిలీకి అనర్హం అన్నట్టు.. ఏది చూసినా ప్రస్తుతం నకిలీవే కనిపిస్తున్నాయి. అయితే ఓ వ్యక్తి ఏకంగా నకిలీ కోర్టునే ఏర్పాటు చేశాడు. అంతటితో ఆగకుండా తానే జడ్జి అంటూ అందర్నీ నమ్మించాడు. గత 5 ఏళ్లుగా అదే దందా కొనసాగిస్తున్నాడు. కొందరికి అనుకూలంగా తీర్పులు ఇస్తూ.. భారీగా వసూళ్ల పర్వానికి తెర లేపాడు. ఈ క్రమంలోనే ఓ కేసు విషయంలో ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు ఇచ్చాడు. అయితే ఆ ఉత్తర్వులను క్షుణ్ణంగా పరిశీలించడంతో.. అవి కాస్తా నకిలీ ఉత్తర్వులు అని తేలింది. దీంతో తీగ లాగితే మొత్తం డొంకంతా కదిలింది. నకిలీ కోర్టుతోపాటు నకిలీ జడ్జి గురించి విన్న పోలీసులు, అధికారులే షాక్ అయ్యారు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ అనే వ్యక్తి.. ఏకంగా కోర్టును ఏర్పాటు చేసి.. తానే జడ్జి అంటూ అందర్నీ నమ్మించాడు. ఈ క్రమంలోనే అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలకు సంబంధించిన కేసులను సేకరించి.. వారిని బుట్టలోకి దింపాడు. ఓ నకిలీ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి.. దాని ముందుకు కోర్టులో పెండింగ్ కేసులతో సతమతం అవుతున్న వారిని పిలిపించుకున్నాడు.
ఆ తర్వాత నకిలీ విచారణ చేపట్టి.. అందులో కొందరికి అనుకూలంగా తీర్పులు కూడా ఇచ్చేశాడు. వారికి అనుకూల తీర్పులు ఇచ్చి.. ప్రతిఫలంగా వారి నుంచి భారీగా డబ్బులు దండుకునేవాడు. కేసు తీవ్రతను బట్టి.. పిటిషనర్ల వద్ద డబ్బులు వసూలు చేసేవాడు. ఇక ఎవరికీ అనుమానం రాకుండా కోర్టు లాగా ఆఫీస్‌ను తయారు చేశాడు. పైగా నకిలీ సిబ్బందిని, లాయర్లను కూడా నియమించుకుని.. ఎవరూ గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాడు.
అయితే 2019లో ఓ ప్రభుత్వ భూమికి సంబంధించిన కేసులో.. తాజాగా ఓ వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చాడు. ఈ తీర్పు వెలువరించే సమయంలో ఏకంగా జిల్లా కలెక్టర్‌కే ఉత్తర్వులు జారీ చేశాడు. అయితే ఆ ఉత్తర్వులు నకిలీవి అని కోర్టు రిజిస్ట్రార్ గుర్తించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, అధికారులు.. మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్ బండారం మొత్తం బయటికి వచ్చింది.
కోర్టు రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టగా.. విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. గత ఐదేళ్లుగా మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్.. ఇలాంటి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా 2015లోనే అతడిపై చీటింగ్ కేసు నమోదైనట్లు గుర్తించారు. తాజాగా ఈ నకిలీ కోర్టు, తీర్పులపై పోలీసులు, న్యాయవ్యవస్థ దర్యాప్తు చేపట్టారు. ఈ విషయం తెలిసి స్థానికులు నోరెళ్లబెడుతున్నారు.