అభం శుభం తెలియని బాలికను ముగ్గురు మైనర్ బాలురు అత్యాచారం చేసిన సంఘటన ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారింది. ఇంటి యజమాని కుమార్తె అయిన ఆ బాలికతో ఆడుకుంటున్న ఆ ముగ్గురు బాలురు.. ఆమెను బిల్డింగ్ టెర్రస్‌పైకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితుల వయసు 6 ఏళ్లు, 13 ఏళ్లు, 16 ఏళ్లు అని పోలీసులు గుర్తించారు. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆ ముగ్గుర మైనర్ బాలురను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో బలియా జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈనెల 16వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే ఓ కుటుంబం.. తమ ఇంట్లో కొన్ని పోర్షన్లను అద్దెకు ఇచ్చింది. అయితే ఆ అద్దె ఇళ్లల్లో ఉండే బాలురతో కలిసి ఆ ఇంటి యజమాని కుమార్తె కూడా ఆడుకుంటూ ఉండేది. 5 ఏళ్ల వయసు ఉన్న ఆ బాలిక.. అదే బిల్డింగ్‌లో అద్దెకు ఉండే 6, 13, 16 ఏళ్ల వయసు ఉన్న ముగ్గురు బాలురతో అక్టోబర్ 16వ తేదీన ఆడుకుంది. ఈ క్రమంలోనే ముగ్గురు నిందితులు.. ఆ బాలికతో కలిసి బిల్డింగ్ టెర్రస్‌పై ఆడుకుంటుండగా.. ఆ చిన్నారిపై వారు అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ ఘటనపై సమాచారం అందుకున్న బలియా జిల్లా ఎస్పీ వీర్.. ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఫోరెన్సిక్ బృందంతో కలిసి పరిశీలించినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ యోగేంద్ర బహదూర్ సింగ్ తెలిపారు. ఇక ముగ్గురు నిందితులపై భారతీయ న్యాయ సంహిత, పోక్సో చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బహదూర్ సింగ్ వెల్లడించారు. అయితే గత నెలలోనే ఇలాంటి ఘటనే సదర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలంలో జరగడం గమనార్హం. 7 ఏళ్ల బాలికపై 8 ఏళ్లు, 7 ఏళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలురు అత్యాచారానికి ఒడిగట్టారు. దీంతో ఆ ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జువైనల్ హోమ్‌కు పంపించారు. కాగా నెల వ్యవధిలో అదే బలియా జిల్లాలో ఇలాంటి అత్యాచార ఘటన మళ్లీ చోటు చేసుకోవడం తీవ్ర సంచనలంగా మారింది. ఇక ఇందులో నిందితులు మైనర్లు కావడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.