సచివాలయం వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందరూ ఊహించిన విధంగానే దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభానికి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీపావళి నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అర్హులైనవారు నగదు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తే.. వారి బ్యాంకు ఖాతాల్లోకి తిరిగి నగదును జమచేస్తారు. అయితే రెండు రోజుల్లోనే జమ చేసేలా చూడాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున.. ఏడాదిలో మూడు సిలిండర్లు అందించాలని నిర్ణయం తీసుకుంది.
మరోవైపు ఉచిత ఇసుక విధానంలోనుూ కీలక మార్పులకు ఏపీ కేబినెట్ పచ్చజెండా ఊపింది. సీనరేజ్, జీఎస్టీ ఛార్జీలను కూడా రద్దు చేసింది. అలాగే ఇసుక రీచ్‍ల నుంచి ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో పాటూ లారీలలోనూ ఉచితంగా ఇసుకను తీసుకెళ్లేందుకు అనుమతించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఈ సందర్భంగా ఉచిత ఇసుక పథకం సక్రమంగా అమలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులను ఆదేశించారు. ఇసుక లభ్యత లేని జిల్లాలలో మినరల్ డీలర్లను పెట్టి ధరల నియంత్రణ చేయాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు విశాఖపట్నంలో శారద పీఠానికి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములను వెనక్కి తీసుకోవాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. శారదా పీఠానికి కేటాయించిన 15 ఎకరాల అత్యంత విలువైన భూమిని వెనక్కి తీసుకోవాలనే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
మరోవైపు ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులు, నాయీ బ్రాహ్మణులకు చోటు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే కమిటీల్లో సభ్యుల సంఖ్య పెంచే చట్ట సవరణకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే ఆలయాల ట్రస్టు సభ్యుల నియామకాల్లో నాయి బ్రాహ్మణులను కూడా తీసుకోవాలని గతంలో వైసీపీ సర్కారు ఆర్డినెన్స్ తెచ్చింది. ఆలయాల్లో భజంత్రీల దగ్గర నుంచి క్షురకుల వరకూ, పల్లకీ సేవల్లో ఇలా.. ఆలయాలతో వారికి విడదీయరాని సంబంధం ఉంటుందని.. అందుకే ట్రస్టు సభ్యులుగా నాయి బ్రాహ్మణులను ఒకరిని తప్పనిసరిగా తీసుకోవాలంటూ గతంలో ఆర్డినెన్స్ తెచ్చారు. ఇప్పుడు చట్టానికి సవరణ చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది.