ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రజల్ని అప్రమత్తం చేశారు. తన పేరుతో కొందరు అక్రమ వసూళ్లు చేస్తున్నారని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆ వివరాలను ఎక్స్ (ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. 'నా పేరు, నా ఫోటో వాడుకుని ఎన్నారై టీడీపీ అనే ఫేక్ ఐడీతో మోసాలు చేస్తున్న మోసగాళ్లు మీకు ఈ క్రింది నెంబర్ల నుంచి మెసేజ్ చేస్తే వారిని బ్లాక్ చేయండి. నా టీం సభ్యులు ప్రజల సమస్యలు పరిష్కరించే పనిలో బిజీగా ఉంటే.. మోసగాళ్లు కొందరు.. నా వద్దకు సాయం కోరి వచ్చే వారి డేటా దొంగిలించి, ఇటువంటి మోసాలకు పాల్పడుతున్నారు. వీరిపై ఇప్పటికే మా సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు' అని తెలిపారు.
'మా టీం @OfficeofNL నుంచి మాత్రమే బాధితుల సమాచారం అడిగి, వారికి కావాల్సిన సహాయం అందిస్తారు. ఇతరత్రా ఏ నెంబర్ నుంచి ఫోన్ వచ్చినా, లేదా మెసేజ్ వచ్చినా, ఫోన్ పే చేయాలని కోరినా, వేరే విధంగా డబ్బు పంపాలని కోరినా అది మోసగాళ్ల పని.. ఆ మెసేజ్‌లకు ఎవరూ స్పందించవద్దు. ఎవరు డబ్బులు అడిగినా తక్షణమే పోలీసులకు ఫిర్యాదు చేయండి' అని ట్వీట్ చేశారు మంత్రి నారా లోకేష్.
'సోషల్ మీడియాలో మంత్రి నారా లోకేష్‌కు వచ్చే రిక్వెస్ట్‌ల ఆధారంగా సహాయం చేస్తామంటూ కొందరు ఆగంతకులు ఎన్నారై టీడీపీ పేరుతో +1(208)648-2504, 8970038602 నంబర్లతో ఫోన్లకు మెసేజ్‌లు పెట్టి నారా లోకేష్ టీమ్ అని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్నారని మా ద్రుష్టికి వచ్చింది. అలాంటి వారి చేతిలో మోసపోవద్దు. వాస్తవానికి నారా లోకేష్ టీం నుంచి మీ సమస్యకు స్పందించినప్పుడు కేవలం మీ సమస్యకు సంబంధించిన వివరాలు మాత్రమే అడుగుతారు. ఇతరులు ఎవరైనా డబ్బులు అడిగితే మోసం అని వెంటనే గుర్తించండి. మీ అకౌంట్ల నుంచి ఫోన్ పే, గూగుల్ పేల ద్వారా గానీ ఒక్క రూపాయి కూడా ఎవరికీ చెల్లించవద్దు. @officeNL నుంచి వచ్చే వాటికి మాత్రమే స్పందించండి' అని సూచించారు.