దానా తుఫాను కారణంగా అనంతపురం మీదుగా వేళ్లే బెంగళూరు-హౌరా-బెంగళూరు అప్ అండ్ డౌన్ రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-భువనేశ్వర్ (రైలు నం. 18464)ను ఈ నెల 23న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 18463)ను 24న రద్దు పరచినట్లు తెలియజేశారు. జిల్లాలోని రాయదుర్గం-కదిరిదేవరపల్లి రైల్వే సెక్షన్‌లో జరుగుతున్న యార్డు ఆధునికీకరణ పనుల కారణంగా తిరుపతి ప్యాసింజరును పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
తిరుపతి-కదిరిదేవరపల్లి ప్యాసింజరు (నం. 07589) రైలును నవంబరు 1 నుంచి 30 వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07590)ను నవంబరు 2 నుంచి డిసెంబరు 1 వరకూ గుంతకల్లు-కదిరిదేవరపల్లి సెక్షన్‌లో పాక్షికంగా రద్దుపరచి, గుంతకల్లు-తిరుపతి సెక్షన్‌లో నడపనున్నట్లు వివరించారు. అలాగే రైల్వే మెయింటెనెన్స్ వర్కుల కారణంగా గుత్తి మీదుగా వెళ్లే కాచిగూడ-తిరుపతి (నం. 07063) ప్రత్యేక రైలును ఈ నెల 29, నవంబరు 5, 12 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నం. 07064)ను ఈ నెల 30న, నవంబరు 6, 13 తేదీల్లోనూ రద్దు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.