‘పథకాల అమలు, ప్రజా సమ్యల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం, లోటుపాట్లు లేకుండా చూడాలి. అంతకు మించి రాజకీయ వివక్షకు తావులేకుండా అర్హత కలిగిన లబ్ధిదారులకు పథకాలు చేర్చాలి. నష్టపోయిన బాధితులకు పరిహారం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. తదనుగుణంగా ఆయా శాఖల అధికారులు మసలుకోవాలి’ అని మంత్రులు డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, గొట్టిపాటి రవికుమార్ సూచించారు. స్థానిక పాత జడ్పీ సమావేశపు హాలులో మంగళవారం ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షత జరిగింది.
మంత్రులు స్వామి, రవికుమార్‌లు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్. ఉగ్ర నరసింహారెడ్డి, నారాయణరెడ్డి, అశోక్‌రెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, వైసీపీకి చెందిన దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి హాజరయ్యారు. ముందుగా అజెండాలో ప్రకటించిన డ్వామా, డీఆర్‌డీఏ, వైద్యారోగ్యశాఖ, హౌసింగ్ శాఖలతోపాటు ఇటీవలి వర్షాలు, పంట నష్టాల అంశాన్ని ప్రత్యేకంగా చర్చించారు.