ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు ప్రసంగిస్తూ, మాజీ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ 43000 కోట్లు దోచుకున్నారని అన్నారు. వైసీపీ పార్టీని అవినీతి మూలాలపై స్థాపించారని విమర్శించారు. అలాంటి పార్టీలు కచ్చితంగా కూలిపోతాయని స్పష్టం చేశారు. "దోపిడీ ఆస్తుల పంపకంలో దుష్ట సంప్రదాయానికి దిగజారిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. జగన్ అతి మంచితనం, అతి నిజాయతీ వలనే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని సాక్షి పత్రికలో రాశారు. వాస్తవానికి జగన్ కి ధన పిచ్చి ఎక్కువ. నీచ రాజకీయాలు చేయడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య. 2004 నాటికి జగన్ ఆస్తులు కోటి 73 లక్షలు. ఇప్పుడు ఆయన ఆస్తులు సుమారు 8 లక్షల కోట్లు. ఈ ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయి ? ఇది ప్రజల సొమ్ము కాదా? ఎవరికీ లేని మినహాయింపులు జగన్ కు ఎలా వస్తున్నాయి? ఇన్ని సంవత్సరాలు ఎలా బెయిల్ పై బయట ఉన్నారు? ప్రజల జీవితాలు మార్చడానికి, రాష్ట్రం అభివృద్ధి చేయడానికి ఉన్నతమైన వ్యక్తులు రాజకీయ పార్టీలను నడపాలి. కేవలం డబ్బులు దోచుకోవడానికి... ప్రజలను మభ్యపెట్టి మళ్లీ అధికారంలోకి రావడానికి రాజకీయ పార్టీలను నడపకూడదు. పేదవాడి కళ్లలో సంతోషం చూసేవాడే రాజకీయ నాయకుడు. కోడి కత్తి, వివేకా హత్య, సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని అబద్దాలను ప్రచారం చేసి జగన్ రెడ్డి గతంలో అధికారంలోకి వచ్చాడు. ఈ ఎన్నికల్లో కూడా గులక రాయి డ్రామాతో అధికారంలోకి రావడానికి యత్నించాడు. ఇది ప్రజలంతా గమనిస్తున్నారు. ప్రజలను ఒక్కసారే మోసం చేయగలరు. అన్ని సార్లు మోసం చేయలేరు అన్న దానికి 2024 ఎన్నికలే నిదర్శనం. జాతీయ మీడియా కూడా ముఖ్యమంత్రుల్లో అత్యధిక ధనవంతుడు జగనే అని ప్రచారం చేసింది. అంత డబ్బులు అతనికి ఎలా వచ్చాయో జగనే ప్రజలకు సమాధానం చెప్పాలి’’ అని పల్లా శ్రీనివాసరావు అన్నారు