ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ తండ్రిని చూసి నా కళ్లలో నీళ్లొచ్చాయి.. ఆ రెండు వంటలు బాగా చేస్తా: అన్‌స్టాపబుల్‌లో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 26, 2024, 09:27 PM

చనిపోతే ఒకే ఒక్క క్షణం.. ఆశయం కోసం పనిచేస్తే అదే శాశ్వతం అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చావు గురించి ఆలోచిస్తే ఏదీ చేయలేమని.. ఏదైనా సరే ముందుకెళ్లి ఎదుర్కొందామని అనుకున్నట్లు చెప్పారు. రాజమహేంద్రవరం జైల్లో ఉన్న సమయంలో పరిస్థితుల్ని చంద్రబాబు వివరించారు. టాలీవుడ్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్‌ షోలో చంద్రబాబు గెస్ట్‌గా వెళ్లారు. గతేడాది తన అరెస్టు, జైల్లో గడిపిన రోజులు, కూటమి ఏర్పాటు వంటి అంశాలపై బాలయ్య ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు ఇచ్చారు.


విజయవాడ వరదల సమయంలో ఓ ఘటనను చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. వరద తీవ్రత, బాధితుల స్థితిగతులు తెలుసుకోవాలంటే.. కచ్చితంగా వాళ్ల దగ్గరకు వెళ్లాలని తాను భావించానన్నారు. అందుకే ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా.. బోటు ఎక్కి వరద బాధిత ప్రాంతాలకు వెళ్లానన్నారు. భద్రతా సిబ్బంది బోటులో వెళ్లొద్దని చెప్పినా పట్టించుకోలేదని.. తాను వెళ్లి చూస్తేనే ప్రజల కష్టాలు తెలుస్తాయన్నారు. అక్కడి పరిస్థితులు చూసి ఎంతో ఆవేదన కలిగిందని.. అందుకే కలెక్టరేట్‌లోనే పది రోజులు బస్సులో బస చేశానన్నారు. ఎప్పటికప్పుడు వరద సహాయ చర్యల్ని దగ్గరుండి పర్యవేక్షించానని.. ఆ సమయంలో ఘటన తనను ఎంతో ఆవేదనకు గురిచేసిందన్నారు.


వరద సమయంలో ఒక తండ్రి తన దగ్గరకు వచ్చి మూడు రోజుల నుంచి పిల్లాడు నీళ్లు అడుగుతున్నాడని.. రెండు బాటిళ్ల నీళ్లు ఇప్పించాలని అడిగారని.. ఆ తండ్రిని, బాలుడ్ని చూసి తన కళ్లలో నీళ్లు తిరిగాయన్నారు. ప్రజలకు ఆహారం, నిత్యావసరాలు అందించేందుకు.. ఎన్ని మార్గాలుంటే అన్నీ ఉపయోగించి తీసుకొచ్చామన్నారు. పాలు, తాగునీళ్లు, బిస్కట్లు, పళ్లు, భోజనం.. ఇలా ఏది దొరికితే అది పంపించామన్నారు. అలాగే ఎంతోమంది దాతలు ముందుకొచ్చారని.. పది రోజుల్లోనే సాధారణ పరిస్థితికి తీసుకొచ్చామని ఎమోషనల్ అయ్యారు.


మరోవైపు చంద్రబాబుకు వంట వచ్చా లేదా అని బాలయ్య అడిగారు.. తనకు వంట పెద్దగా రాదని.. కానీ సలహాలు మాత్రం ఇస్తానన్నారు. అయితే తాను పప్పు బ్రహ్మాండంగా చేస్తానని.. ఆమ్లెట్‌ ఈజీగా వేస్తానని చెప్పారు. తనకు కాఫీ అంటే ఇష్టమని.. ప్రతి రోజూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల మధ్య ఒక కాఫీ తాగుతానని చెప్పారు. హైదరాబాద్‌లో ఉంటే.. భువనేశ్వరితో కలసి కాఫీ తాగుతానని చెప్పారు. విశాఖ, విజయవాడల్లో ఏ నగరం ఇష్టమని అడిగితే.. తన ఛాయిస్‌ అమరావతి.. విశాఖపట్నం, విజయవాడ రెండింటినీ అభివృద్ధి చేస్తామన్నారు. భువనేశ్వరి, బ్రాహ్మణిలలో ఎవరు బాస్ అంటే.. తనకు భువనేశ్వరి బాస్, లోకేష్‌కు బ్రాహ్మణి బాస్‌ అన్నారు. వారిద్దరు కుటుంబానికి బలమన్నారు.


చంద్రబాబును మనవడు దేవాన్ష్ కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు. రాజకీయాల్లో బిజీగా ఉండే తాత.. తీరిక సమయాల్లో ఏం చేశారని దేవాన్ష్ అడిగారు. 'టైం దొరికితే నీ ఆడుకుంటూ రిలాక్స్ అయ్యేవాడినని.. ఇప్పుడు నువ్వు టైం ఇవ్వట్లేదు.. ఎప్పుడూ బుక్స్‌తో కుస్తీ పడుతుంటావు. నాకు కూడా చేస్తున్న పని మార్చుకుంటే రిలాక్సేషన్‌ వస్తుంది’ అని చంద్రబాబు సమాధానం ఇచ్చారు. దేవాన్ష్ అడిగిన పొడుపు కథకు తెలివిగా సమాధానం చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com