ఇటీవల కురిసిన భారీ వర్షానికి బెంగళూరులోని హెన్నూరులో నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలి 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అనధికారికంగా, నాసిరకంగా కట్టిన భవనాలను కూల్చివేసేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్టు తెలిపింది.విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఈ విషయాన్ని వెల్లడించారు. అనధికారిక భవనాలపై చర్యలు తీసుకోకుండా గత ప్రభుత్వం అధికారుల చేతులు కట్టేసిందని శివకుమార్ విమర్శించారు. కానీ, తమ ప్రభుత్వం మాత్రం అలాంటి పని చేయదని, ఇలాంటి భవనాలపై చర్యలు తీసుకునే అధికారం బృహత్ బెంగళూరు మహానగర పాలిక (బీబీఎంపీ), బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (బీడీఏ), బెంగళూరు మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (బీఎంఆర్‌డీ)కు ఇస్తున్నట్టు తెలిపారు. అనధికారిక ఆస్తులకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని చెప్పారు. ఆక్రమణలను లేని నగరంగా బెంగళూరును తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని వివరించారు. ముంపు నుంచి నగరానికి శాశ్వత పరిష్కారంపై మాట్లాడుతూ వరద కాలువలు నిర్మిస్తామని, వాటి వెంబడి ఉన్న రోడ్లను అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. తొలి విడతలో ఇలాంటి రోడ్లను 300 కిలోమీటర్ల మేర అభివృద్ధి చేయనున్నట్టు చెప్పారు.