ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఇప్పటికే పలు వ్యాపార సంస్థల ఏర్పాటు, విశాఖ సమీపాన భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారు. తాజాగా, అక్కడ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు ఆంధ్ర క్రికెట్ అకాడమీ ఛైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ప్రకటించారు. భోగాపురంలో స్టేడియం నిర్మాణ స్థలాన్ని ఏసీఏ సభ్యులతో కలిసి ఛైర్మన్ పరిశీలించారు. భోగాపురంలో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని ఈ సంద్భంగా ఎంపీ కేశినేని చిన్ని ప్రకటన చేశారు. ఎయిర్ పోర్ట్ దగ్గరలో ఈ స్టేడియం నిర్మిస్తున్నట్టు చెప్పారు. రాజధాని అమరావతితో పాటు విశాఖ అభివృద్ధి సమాంతరంగా జరుగుతుందని అన్నారు. ఆదివారం ఉదయం విశాఖ నుంచి విజయవాడకు కొత్తగా రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన వైజాగ్ నుంచి అమరావతికి వచ్చే వ్యాపారస్తులకు, ప్రజలకు ఈ సర్వీస్ చాలా ప్రయోజనంగా ఉంటుందని అన్నారు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి, ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని ఎంపీ కేశినేని ఆశాభావం వ్యక్తం చేశారు.. రాష్ట్రానికి కొత్త విమాన సర్వీసులు తీసుకురావడానికి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎంతగానో కృషి చేస్తున్నారని కొనియాడారు.
కాగా, ఇప్పటికే విశాఖలో టీసీఎస్, లులు సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చిన విషయం తెలిసిందే. వాస్తవానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలోనే భోగాపురంలో క్రికెట్ స్టేడియం నిర్మాణ చేపడతారనే ప్రచారం సాగింది. ఆధునిక వసతులతో కూడిన భారీ స్టేడియం నిర్మాణానికి భూమి కేటాయించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ప్రపంచస్థాయి స్టేడియం 300 ఎకరాల్లో నిర్మిస్తామని జగన్ ప్రకటించారు. దీనికి భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపాన స్థలం ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరిగింది. ప్రస్తుతం స్టేడియం నిర్మాణంపై ఏసీఏ ఛైర్మన్ ప్రకటన చేయడంతో త్వరలోనే ఇది కార్యరూపం దాల్చే అవకాశం ఉంది.
కాగా, ప్రస్తుతం విశాఖ నగరం నడిబొడ్డున మధురవాడ సమీపంలో మొత్తం 24 ఎకరాల్లో ఏసీఏ-వీడీసీఏ స్టేడియం జాతీయ రహదారికి ఆనుకుని ఉంది. అక్కడ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించినప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతోంది. భోగాపురంలో అత్యాధునిక ప్రమాణాలతో అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణ జరుగుతోంది. దీంతో పలు దేశాలకు ఇక్కడ నుంచి నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తాయి. ఈ నేపథ్యంలో దానికి సమీపంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం ఉంటే.. మ్యాచ్‌ల నిర్వహణ సమయంలో ఆటగాళ్లకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు.