రాష్ట్రంలో భూముల విలువను సవరించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డిసెంబరు 1 తేదీ నుంచి కొత్త విధానం అమలకు సూత్రప్రాయంగా నిర్ణయించింది. నివాస, వాణిజ్య, పారిశ్రామిక, వ్యాపార, పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతమున్న ధరలు, మార్కెట్ విలువ, తదితర అంశాలపై సర్కారు అధ్యయనం చేసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. కొన్నిచోట్ల రిజిస్ట్రేషన్ విలువ బహిరంగ మార్కెట్ కంటే ఎక్కువగా ఉండటం వంటి లోపాలను సరిదిద్ది.. స్థానిక అభివృద్ధి, ఇతర అంశాల ప్రతిపాదికన కొత్త విలువను ఖరారు చేయనుంది. జిల్లా సంయుక్త కలెక్టర్ స్థాయిలో కమిటీలు ఏర్పాటుచేసి.. రిజిస్ట్రేషన్ విలువపై రెండున్నర నెలలుగా రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ కసరత్తు చేస్తోంది.
ఆర్థిక, రెవెన్యూ శాఖల మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్ సెక్రటేరియట్‌లో శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమై ఈ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. విలువల పెంపు, తగ్గింపు ఏయే ప్రాంతాల్లో ఎలా ఉండాలనే దానిపై ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కనిష్ఠంగా 10 శాతం నుంచి గరిష్ఠంగా 20 శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచే అవకాశం ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.. ప్రస్తుతం అమల్లో ఉన్న విలువలు వాస్తవికతకు దూరంగా ఉంటే వాటిని తగ్గిస్తారని తెలిపారు.
మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. ‘కారిడార్ గ్రోత్, నేషనల్ హైవేలు, ఇతర అంశాల ప్రతిపాదికన రిజిస్ట్రేషన్ విలువలు ఖరారు చేస్తాం. ఆయా ప్రాంతాల్లోని సర్వే నంబర్లు, వాటి పరిధి, జరిగిన అభివృద్ధి, స్టాంపుల రిజిస్ట్రేషన్, ఇతర వివరాలను ప్రత్యేక కమిటీలు పరిశీలిస్తున్నాయి. గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా... విలువల పెంపు క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది.. గత ఆర్దిక సంవత్సరం 2023-24లో స్టాంపుల రిజిస్ట్రేషన్ ద్వారా రూ.10,005 కోట్ల ఆదాయం సమకూరింది.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.5,235.31 కోట్ల ఆదాయం వచ్చింది’ అని తెలిపారు.
అలాగే, గతంలోలాగే సబ్-రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్టాంపు పేపర్లను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. ఈ-స్టాంపింగ్‌తో పాటు స్టాంపుపేపర్ల ద్వారా రిజిస్ట్రేషన్లను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రూ.50, రూ.100 విలువ కలిగిన 10 లక్షల స్టాంపు పేపర్ల చొప్పున సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో కొన్ని గ్రామాల్లోనే రీ-సర్వే పూర్తికాగా, మిగతా చోట్ల సర్వే నంబర్ల ఆధారంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సచివాలయంలో జరిగిన మంత్రుల సమావేశంలో ఆర్థికశాఖ అధికారులతోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఐజీ శేషగిరిబాబు పాల్గొన్నారు. రెండువారాల్లో మరో సమావేశం నిర్వహించనున్నారు. విలువల పెంపుపై పూర్తిస్థాయిలో అప్పుడే స్పష్టత వస్తుందని అధికారులు పేర్కొన్నారు.