సాగరనగరం విశాఖపట్నం- విజయవాడ మధ్య కొత్తగా రెండు విమాన సర్వీసులు ఆదివారం నుంచి ప్రారంభకానున్నాయి. ఈ మేరకు విశాఖ విమానాశ్రయం డైరెక్టర్ రాజారెడ్డి శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇండిగో, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానయ సంస్థల సర్వీసులను ఆదివారం ఉదయం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయలుదేరి 10.35 గంటలకు విజయవాడ (గన్నవరం విమానాశ్రయం) చేరుకుటుంది. తిరిగి రాత్రి 7. 55 గంటలకు విజయవాడలో బయలుదేరి రాత్రి 9 గంటలకు విశాఖకు చేరుకుంటుందని చెప్పారు.
ఇండిగో సంస్థ సర్వీసు రాత్రి 7.15 గంటలకు విజయవాడలో బయలుదేరి 8.20 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. అదే విమానం రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయలుదేరి 9.50 గంటలకు విజయవాడకు చేరుతుందని తెలిపారు. ఈ కొత్త విమానాలతో కలిపి విశాఖ- విజయవాడ మధ్య విమాన సర్వీసుల సంఖ్య మూడుకు చేరనుంది. దీంతో రాజధాని అమరావతికి వచ్చే పౌరులు, విజయవాడకు వ్యాపార పనులకు వచ్చేవారికి ప్రయోజనం ఉంటుంది.
కాగా, రాష్ట్రంలో కొత్తగా మరో ఏడు విమానాశ్రయాల నిర్మాణించాలని ప్రభుత్వం భావిస్తోంది. నెల్లూరు జిల్లాలోని దగదర్తి, చిత్తూరు జిల్లాలోని కుప్పం, గుంటూరు సరిహద్దు నాగార్జునసాగర్ సహా పలుచోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలకు కేంద్ర పౌరవిమానయాన శాఖ ఆమోదం లభిస్తే పనులు ప్రారంభమవుతాయి. ఇప్పటికే భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దీనిని 2026 జూన్ నాటికి పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నిర్ణీత గడువుకు ముందే పూర్తయ్యేలా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. 2026 జనవరి నాటికి తొలి విమానం రన్‌వేపై దిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
ఇక, సముద్ర తీరంలో చేప ఆకారంలో నిర్మిస్తోన్న ఈ విమానాశ్రయంలో 3.8 కి.మీ. పొడవున రెండు రన్‌వేలు, టెర్మినల్ టవర్, ఎయిర్‌ఫీల్డ్‌లు ఉంటాయి. టాక్సీవే, ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్, జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది లేకుండా అనుసంధాన రహదారిని కలిపేందుకు ‘8’ ఆకారంలో ట్రంపెట్ నిర్మిస్తారు.