ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సెమీ-హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ రోజు రోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, ప్రధాన నగరాల మధ్య 66 రైళ్లు నడుస్తున్నాయి. సాధారణ రైళ్లల్లో ఇప్పటివరకు లేని అధునాతన సౌకర్యాలు, ప్రత్యేకతలు వందే భారత్‌కు అదనపు ఆకర్షణ. దీంతో ఈ రైళ్లకు డిమాండ్ పెరుగూత ఆక్యుపెన్సీ రేషియో అధికంగా ఉంటోంది. పండగల సీజన్లల్లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ- గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చే ఉద్దేశంతో వందే భారత్‌వైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ మరిన్ని వందేభారత్‌లను తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉంది. డిమాండ్‌ను ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అందుబాటులోకి తీసుకుని రాబోతోంది. ఈ క్రమంలో మరో నాలుగు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను త్వరలోనే పట్టాలెక్కించనుంది. మహారాష్ట్రలోని పుణే రైల్వే స్టేషన్ నుంచి వివిధ మార్గాల్లో ఈ నాలుగు రైళ్లు కూడా రాకపోకలు సాగిస్తాయి. వీటిలో ఒకటి సికింద్రాబాద్‌కు నడపనున్నారు. పుణే- సికింద్రాబాద్,. పుణే- షెగావ్ (మహారాష్ట్ర), పుణే- వడోదర (గుజరాత్), పుణే- బెళగావి (కర్ణాటక) మధ్య ఈ రైళ్లను నడుపుతారు. ఈ రైళ్ల షెడ్యూల్, టైమ్ టేబుల్, ఆగే స్టేషన్ల వంటి వివరాలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
ఈ రైళ్ల ప్రారంభ తేదీని రైల్వే మంత్రిత్వ శాఖ ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో కోడ్ అమల్లో ఉంది. ఇది ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ రైళ్లకు పచ్చజెండా ఊపే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శరవేగంగా పూర్తిచేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం పుణే- కొల్హాపూర్ మధ్య వందే భారత్ రైలు నడుస్తోంది. సోలాపూర్ నుంచి ముంబై మధ్య నడిచే మరో ఎక్స్‌ప్రెస్ పుణే మీదుగా వెళ్తుంది. వీటికి అదనంగా ఈ నాలుగు అందుబాటులోకి రానున్నాయి.
ఇక, ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే సికింద్రాబాద్- విశాఖ- తిరుపతి మధ్య వందేభారత్ రైలు అందుబాటులో ఉంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య రెండు రైళ్లు నడుస్తున్నాయి. త్వరలోనే వందేభారత్ స్లీపర్ రైలు కూడా పట్టాలెక్కనుంది. ఈ రైలు ట్రయల్ రన్ నవంబరు 15న మొదలై.. రెండు నెలల పాటు సాగుతుందని అధికారులు తెలిపారు. దీంతో జనవరి చివరి వారంలో ఇవి ప్రారంభం కానున్నాయి. వందేభారత్ తొలి స్లీపర్ రైలు తొలి విడతలో సికింద్రాబాద్ నుంచి ఒకటి నడపుతారని తెలుస్తోంది.