దీపావళి పండుగకు మరో మూడు రోజులే ఉండగా.. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని బాంద్రా టెర్మినల్‌లో ఒక్కసారిగా ప్రయాణికులు రైలు ఎక్కేందుకు ఎగబడటంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ముంబయి నుంచి యూపీలోని గోరఖ్‌పూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కే ప్రయత్నంలో 9 మంది గాయపడ్డారు. రైలు ఎక్కే క్రమంలో కిందపడిపోయిన వీరిపై నుంచి తోటి ప్రయాణికులు తొక్కుకుంటూ వెళ్లారు. దీంతో గాయపడిన బాధితులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించగా.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. మిగతా ఏడుగురికి ప్రాణాపాయం లేదని పేర్కొన్నారు. దీపావళి పండగ రద్దీ కారణంగానే తొక్కిసలాట చోటుచేసుకుందని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ తెలిపింది.
రైలు నంబరు 22921 ముంబయి-గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ బాంద్రా రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ ఒకటికి వచ్చిన సమయంలో అక్కడ పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఆ బండి ఎక్కేందుకు ప్రయత్నించారు. వారానికి ఒక్కసారి నడిచే ఈ రైలు ఆదివారం ఉదయం 5.10 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. రీ షెడ్యూల్ చేశారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కానీ, ఈ రైలు నిర్దేశిత సమయానికి కంటే ప్లాట్‌ఫామ్‌పైకి ఆలస్యంగా వచ్చింది. తెల్లవారుజామున 3 గంటలకే అక్కడ భారీ రద్దీ నెలకుంది. రైలు వచ్చిన తర్వాత జనరల్ కంపార్ట్‌మెంట్‌లోకి ఎక్కేందుకు జనం ప్రయత్నించగా.. ఇది తొక్కిసలాటకు దారితీసింది.
మొత్తం 22 బోగీలు 1000కిపై సీట్లు ఉండే ఈ రైలు పూర్తిగా అన్-రిజర్వడ్. బండి ప్లాట్‌ఫామ్‌పైకి వస్తుండగానే సీట్లు దొరకవేమోనని కొందరు రన్నింగ్‌లో ఎక్కేందుకు ప్రయత్నించారు. దీంతో ఇద్దరు ప్రయాణికులు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వీరిని హుటాహుటిన రైల్వే పోలీసులు, ఇతర ప్రయాణికులు కాపాడే ప్రయత్నం చేశారు. బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఓ వీడియో గాయపడిన వ్యక్తి రైల్వే పోలీస్ తన భుజాలపై మోసుకెళ్తండగా.. రక్తపు మరకలతో ఇద్దరు వ్యక్తులు నెలపై ఉన్నారు. మరో ఇద్దరు స్ట్రెచ్చర్‌పై మరో వ్యక్తిని తీసుకుని వెళ్తున్నారు. రద్దీని నియంత్రించడానికి అక్కడ 50 మంది పోలీసులను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని, క్షతగాత్రులను చికి్త్స కోసం ఆసుపత్రికి తరలించామని చెప్పారు. ఓ వ్యక్తికి వెన్నుముకకు గాయం కాగా.. కొందరికి కాళ్లకు దెబ్బతగిలింది. స్వల్పగాయాలైన ఇద్దరిని ప్రాథమిక చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారు. తీవ్రంగా గాయపడిన పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరి ప్రయాణికులకు ఐసీయూలో చికిత్స కొనసాగుతోందని పోలీస్ అధికారులు వెల్లడించారు.