స్కిల్ స్కామ్‌లో చంద్రబాబే దోషి అని, హైకోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కౌంటర్‌తో ఈ విషయం మరోసారి సుస్పష్టమైందని వైయస్ఆర్‌సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. ఈ కేసులో చంద్రబాబుకు ఉచ్చు బలంగా బిగుసుకుంటోందన్న ఆయన, సూట్‌కేస్ కంపెనీల ద్వారా రూ.151 కోట్లు దారి మళ్లించి స్వాహా చేసిన విషయం ఈడీ దర్యాప్తులో తేలిందని తెలిపారు.
ఈ కేసు కుట్రపూరితమంటూ నాడు విమర్శలు గుప్పించిన కూటమిలోని జనసేన, బీజేపీ ఇప్పుడేమంటాయని ప్రశ్నించారు. ఏకంగా రోడ్డు మీద పడుకున్న నాయకులు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కాకినాడలో వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆదివారం మీడియాతో మాట్లాడారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో పక్కా ఆధారాలతో సహా దొరికిన, చంద్రబాబు నిర్దోషి అంటూ ఆయనను సమర్థించిన పార్టీలు, నాయకులకు ఇప్పుడు హైకోర్టులో ఈడీ కౌంటర్ చెంపపెట్టు వంటిదని కన్నబాబు స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అవినీతికి పాల్పడినట్టు స్పష్టమైన ఆధారాలున్నా, కూటమి ప్రభుత్వం వచ్చాక సీఐడీ దర్యాప్తును అటకెక్కించారని మాజీ మంత్రి తెలిపారు. అయితే కేసు దర్యాప్తులో భాగంగా సుమన్‌బోస్, వికాస్ వినాయక్ కన్వేల్కర్ ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ఇటీవల ప్రకటించడం, తాజాగా అదే ఈడీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేస్తూ, సూట్‌కేస్ కంపెనీల వివరాలు బయటపెట్టిన నేపథ్యంలో, స్కామ్‌లో చంద్రబాబు పాత్రను అందరూ నమ్ముతున్నారని చెప్పారు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని గతంలోనే కాగ్ నిర్ధారించిందని, ఈ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చిని విషయాన్ని ఈ సందర్భంగా కన్నబాబు ప్రస్తావించారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఈ స్కాం గురించి పుణెలోని ఒక విజిల్ బ్లోయర్ వివరాలు అందించినా విచారణ జరిపించకుండా అడ్డుకోవడంతో పాటు, ఫైల్స్ దహనం చేశారని గుర్తు చేశారు. కేసు దర్యాప్తులో విచారణకు హాజరు కావాలని చంద్రబాబు పీఎస్ పెండ్యాల శ్రీనివాస్‌కు నోటీస్ ఇస్తే, హాజరు కాకుండా విదేశాలకు పారిపోయిన ఆయనకు, టీడీపీ అధికారంలోకి వచ్చాక తిరిగి ఉద్యోగం ఇవ్వడం నిబంధనలు ఉల్లంధన అని అభిప్రాయపడ్డారు. ఈ కేసును సీఐడీ ద్వారా కాకుండా స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా పారదర్శకంగా విచారణ జరిపించాలన్నది తమ పార్టీ డిమాండ్ అని కన్నబాబు చెప్పారు.