‘కరెంట్ చార్జీలు పెంచడమేనా, ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక’ అంటూ కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు చంద్రబాబు ఎన్నికల నాటి హామీలను గుర్తు చేస్తూ వైయస్ జగన్ ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. ‘కరెంట్ ఛార్జీలు పెంచడమేనా, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న దీపావళి కానుక.. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని, అవసరమైతే విద్యుత్ ఛార్జీలను 30 శాతం తగ్గిస్తామని ఎన్నికల ముందు ప్రచారంలో మీరిచ్చిన హామీ ఏమైంది చంద్రబాబు? టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే విద్యుత్తు ఛార్జీలను తగ్గించే వాళ్లం అని చెప్పిన మీరు ప్రజలు ఎంత వద్దని వేడుకున్నా వినిపించుకోకుండా రూ.6,072.86 కోట్ల భారం వేయడం భావ్యమేనా చంద్రబాబూ? ఎన్నికల ముందు అధికారం కోసం ఇచ్చిన హామీ మేరకు, ఈ ఛార్జీలను ప్రభుత్వమే భరించాలని వినియోగదారులు చేసిన విజ్ఞప్తులను ప్రభుత్వం ఎందుకు పెడచెవిన పెట్టింది. ప్రజలపై అదనపు ఛార్జీలను వేయడమేనా మీ విజన్. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంత భారీ స్థాయిలో విద్యుత్ ఛార్జీలు పెంచి మాట తప్పడమే మీ నైజమని మరోసారి రుజువు చేశారు అంటూ వైయస్ జగన్ ధ్వజమెత్తారు.