ఆ గ్రామ యువకులు గజ్జె కట్టి తప్పెట గుళ్ల ప్రదర్శనతో చిందేస్తే చూపరులు మంత్రముగ్ధులవ్వాల్సిందే. వారి నైపుణ్యంతో శ్రీకాకుళం జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ గ్రామానికి ఎంతో పేరు తీసుకువచ్చారు. మరోవైపు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ వేలాది ప్రదర్శనలతో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. నరసన్నపేట పట్టణానికి సమీపంలో ఉన్న కరగాం పంచాయతీ అడవినారాయణవలస గ్రామం ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోంది. ఈ గ్రామంలో 130 కుటుంబాలు ఉన్నాయి. ప్రతీ ఇంటా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ప్రతి రోజూ ఉదయం 4గంటలకే ఆ గ్రామంలో సుప్రభాతం వినిపిస్తుంది. ఆ తర్వాత ఆంజనేయస్వామి, అమ్మతల్లి ఆలయాలు వద్ద భజన, తప్పెటగుళ్లు వంటివాటితో భగవంతున్ని కీర్తించడం గ్రామస్థుల దినచర్య. ఆ దినచర్యతో ప్రారంభించిన భజన, తప్పెటగుళ్లు.. నేడు జిల్లాలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చేలా చేసి.. గ్రామానికి గుర్తింపు తెచ్చారు. అడవి నారాయణవలసలో 50 ఏళ్ల కిందట తప్పెట గుళ్లు ప్రదర్శనను కొందరి యువకులు నేర్చుకున్నారు. ఖాళీ సమయంలో గ్రామంలో కాలక్షేపానికి ఇచ్చే ప్రదర్శనలు.. అప్పట్లో జిల్లాస్థాయిలో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాల్లో పలుమార్లు ప్రదర్శించేవారు. ప్రస్తుత యువత కూడా దీన్నే వారసత్వంగా తీసుకుని తప్పెటగుళ్లు నేర్చుకున్నారు. గత పదేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో, శివరాత్రి సమయాల్లో నిర్వహించే జాతరల్లో పలు ప్రదర్శలు ఇస్తూ అంతరించిపోతున్న సిక్కోలు సంస్కృతికి ప్రతీకగా నిలుస్తున్నారు. జిల్లాలో ఎక్కడ పండగలైనా.. జాతరలైనా.. తప్పెటగుళ్ల ప్రదర్శన పేరు ఎత్తితే.. ముందుగా అడవినారాయణవలస గ్రామస్థులే గుర్తుకురావడం గమనార్హం.