తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంది. గత కొద్ది రోజులుగా భక్తులు తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. కంపార్ట్‌మెంట్లన్నీ ఖాళీగా ఉన్నాయి. భక్తులు వేగంగా శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు.గతంలో ఎన్నడూ లేని విధంగా శని, ఆదివారాలు కూడా భక్తుల సంఖ్య తక్కువగా ఉంది. తుపాన్లు, భారీ వర్షాలతో భక్తుల సంఖ్య తగ్గింది. మరోవైపు ఇయర్ ఎండింగ్ కావడంతో భక్తుల రద్దీ అంతంత మాత్రంగానే ఉందని కూడా చెబుతున్నారు. రానున్న కాలంలో రద్దీ పెరిగే అవకాశముందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. వసతి గృహాల కౌంటర్ల వద్ద కూడా పెద్దగా రద్దీ లేదు. ఎక్కువ సమయం వెయిట్ చేయకుండానే వసతి గృహాలు లభ్యమవుతున్నాయి. ముందుగా బుక్ చేసుకున్న వారు మినహాయించి ఎవరూ పెద్దగా తిరుమల శ్రీవారి దర్శనానికి రావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే దీపావళి నాటికి మరింత రద్దీ పెరుగుతుందని భావిస్తున్నారు.
దీపావళి రోజున తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆస్థానం జరుగుతుంది. ఆరోజు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. సిఫార్సు లేఖలను కూడా స్వీకరించమని తెలిపింది. సాధారణ దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు వెల్లడించారు. ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఖాళీగా ఉన్నాయి. నేడు కూడా నేరుగా శ్రీవారిని దర్శించుకునే వీలుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లో ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు గంటల సమయం పడుతుంది. టైమ్ స్లాట్ దర్శనానికి రెండు గంటల సమయం, మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లో పూర్తవుతుంది. దీంతో ఒక్కొక్కరు రెండు సార్లు స్వామి వారి దర్శనం చేసుకుంటున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 63,729 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం నిన్న 3.85 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.