కృష్ణపట్నం పోర్టు సందర్శనకు వెళ్లిన టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అక్కడి భద్రతా సిబ్బందిపై అత్యంత హేయంగా చేయి చేసుకున్నారని, దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. ఒక సెక్యూరిటీని ఒక ఎమ్మెల్యే స్వయంగా కొట్టడం గతంలో ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్న ఆయన, చివరకు ఈ ఘటనను కూడా వక్రీకరిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడు యథేచ్ఛగా ప్రజల ఆస్తిని దోచేస్తున్నారని, అమ్మేస్తున్నారని, తమ అనుయాయులకు ప్రభుత్వ పెద్దలు వాటిని కట్టబెడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు. ఆ దిశలోనే తాజాగా మూడు పోర్టుల ప్రైవేటీకరణ మొదలు పెట్టారని ఆయన ఆక్షేపించారు. నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..... కృష్ణపట్నం పోర్టులోకి ఎమ్మెల్యేను అనుమతించలేదన్నది అవాస్తవం అని.. ఆయన్ను ఎవరూ ఆపలేదని.. ఆయన వెంట ఉన్న ఇతర సిబ్బంది, మీడియాను మాత్రం అనుమతించలేదని వివరించారు.
బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడమని సూచిస్తే.. తీవ్రంగా ఆగ్రహించిన సోమిరెడ్డి కారు దిగి వచ్చి సెక్యూరిటీ గార్డును కొట్టారని తెలిపారు. అలాంటి వ్యక్తి ప్రాతినిథ్యం వహిస్తున్న సర్వేపల్లికి తానూ గతంలో ప్రాతినిథ్యం వహించానని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యే ప్రవర్తనకు సిగ్గు పడుతున్నానని కాకాణి గోవర్థన్‌రెడ్డి చెప్పారు. ఆయన (ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి)కు ఆ పోర్టు యాజమాన్యంతో బేరసారాలు కుదరకనే ఈ వ్యవహారం చోటు చేసుకుందని.. అందుకే ఆయన మందీ మార్బలం, మీడియాతో పోర్టుకు వెళ్లారని తెలిపారు. వీరి ప్రవర్తన ఇలా ఉంటే, రేపు రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు ఎవరైనా వస్తారా? అని మాజీ మంత్రి ప్రశ్నించారు. రెడ్‌కార్పెట్ పర్చాం. కాబట్టి పారిశ్రామికవేత్తలు రావాలని మీరు చెబుతూ.. ఈ విధంగా ప్రవర్తిస్తే ఎవరైనా ఇక్కడకు పెట్టుబడులకు వస్తారా? ఇలా ఆ సిబ్బందిని రక్తం వచ్చినట్లు కొడితే, వారు పెట్టుబడులకు ముందుకు వస్తారా? అని నిలదీశారు. ఇప్పుడు పోర్టుల ప్రైవేటీకరణపై నిర్ణయం తీసుకుని, ఆర్ధిక భారం వల్ల, వాటిని చేపట్టలేకపోతున్నామని, అందుకే ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించామని కూడా వారు వాదిస్తారని కాకాణి గోవర్థన్‌రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఆ పోర్టులకు భూసేకరణ, రైతులకు చెల్లింపులు, రుణాల సేకరణతో పాటు, అన్ని అనుమతులు సాధించి, నిర్మాణం చేస్తుంటే, మొత్తం కష్టాన్ని బూడిదపాలు చేస్తూ, వాటిని ప్రైవేటుపరం చేసేందుకు టెండర్లు పిల్చారని ఆక్షేపించారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు దాదాపు 56 ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి గుర్తు చేశారు.