కూటమి ప్రభుత్వం ఆపేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని తక్షణం పునరుద్ధరించాలని, లేదంటే రైతుల ఆగ్రహాన్నికి గురికావాల్సి ఉంటుందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నాలుగు నెలల్లో ఏ ఒక్కరోజూ రైతుల బాగోగులు పట్టించుకున్న పాపానపోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ లో భాగంగా రైతులకు ఏటా ఇస్తామన్న రూ. 20 వేలు ఇవ్వకపోగా, గత ఐదేళ్లుగా అమలు జరుగుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించారని ఆరోపించారు.
2023-2024 సీజన్‌కి గాను ఈ ఏడాది జూన్‌లో రైతుల తరఫున రూ. 930 కోట్లు చెల్లించకుండా ఎగ్గొట్టిన కారణంగా వర్షాలకు పంట నష్టపోయిన రైతులకు అందాల్సిన రూ. 1,385 కోట్లు పరిహారం అందకుండా ఆగిపోయింది. గత ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో రైతుల తరఫున రూ. 3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో బీమా కంపెనీలకు చెల్లించడం జరిగిందని కారుమూరి గుర్తుచేశారు. గడిచిన ఐదేళ్లలో 5.2 ఎకరాలకు బీమా అందించామని, సగటున ఏడాదికి 40.5 లక్షల మంది రైతులకు ఐదేళ్లలో 2.04 కోట్ల మందికి బీమా కవరేజ్ కల్పించినట్టు చెప్పారు. 2014-2019 మధ్య ఉచిత పంటల బీమా పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం రూ. 3411.2 కోట్లు మాత్రమే ఇవ్వగా, గడిచిన ఐదేళ్ల వైయస్ జగన్ పాలనలో 54.55 లక్షల మంది రైతులకు రూ. 7802 కోట్ల మేర బీమా పరిహారం నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేశామని వివరించారు.