తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన హీరో దళపతి విజయ్.. ఇటీవలె తొలి మహానాడును ఏర్పాటు చేశారు. ఈ సభకు భారీగా జనం, అభిమానులు, టీవీకే పార్టీ శ్రేణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన విజయ్.. తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇక విజయ్ ప్రసంగంపై స్పందించిన తమిళనాడులోని డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. విజయ్ పార్టీ విధానాలు, సిద్ధాంతాలు.. మిగిలిన పార్టీల నుంచి కాపీ పేస్ట్ చేసినవి అని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా టీవీకే పార్టీ శ్రేణులను ఉద్దేశించి.. దళపతి విజయ్ ఒక లేఖను విడుదల చేశారు.
తమిళగ వెట్రి కళగం పార్టీ.. కేవలం నిర్మాణాత్మకమైన విమర్శలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు, హీరో దళపతి విజయ్ స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు వస్తున్న విమర్శలపై స్పందించిన విజయ్.. రానున్న రోజుల్లో ఈ విమర్శలు మరింత తీవ్రం అవుతాయని.. తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి ఒక లేఖను విడుదల చేశారు. రాజకీయాల్లో టీవీకే పార్టీ ఎప్పుడూ నిర్మాణాత్మక పాత్రను పోషిస్తుందని తేల్చి చెప్పారు. అదే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ష్యాలను సాధిస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఇక టీవీకే పార్టీపై డీఎంకే, అన్నాడీఎంకేల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ విజయ్ స్పందించడం గమనార్హం.
ఈ సందర్భంగా కార్యకర్తలకు లేఖ రాసిన విజయ్.. భవిష్యత్తులో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజలు టీవీకే పార్టీని గుర్తించేలా మనస్ఫూర్తిగా పని చేద్దామని పార్టీ శ్రేణుల్లో ఉత్సాహనం నింపారు. ఎప్పుడూ నిర్మాణాత్మకమైన రాజకీయాలను అనుసరిస్తామని.. 2026 నాటికి మన లక్ష్యాలను కచ్చితంగా సాధిస్తాం.. టీవీకే పార్టీకి విజయం ఖాయమని ఆ లేఖలో విజయ్ వెల్లడించారు.
ఇక ఇప్పటికే పార్టీని స్థాపించిన దళపతి విజయ్.. ఆ పార్టీకి గతంలోనే తమిళగ వెట్రి కళగం అనే పేరును పెట్టారు. పార్టీ పెట్టిన ఇన్ని రోజుల తర్వాత ఇటీవలె.. అక్టోబర్ 27వ తేదీన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో మొదటి మహానాడు నిర్వహించింది. ఈ సందర్భంగా టీవీకే పార్టీ సిద్ధాంతాలు, తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి గల కారణాలను విజయ్ తెలిపారు. సినిమా ఇండస్ట్రీతో పోల్చిస్తే రాజకీయాలు సీరియస్ అని తెలిపిన విజయ్.. రాజకీయాల్లో తనకు అనుభవం లేకపోయినా.. భయపడనని వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం తన సినీ కెరీర్ వదిలేసి వచ్చానని.. వారి కోసమే పోరాడుతానని తేల్చి చెప్పారు.