ప్రస్తుత పరిస్థితుల్లో ధ్రువపత్రాలు అనేవి చాలా తప్పనిసరిగా మారిపోయాయి. ప్రభుత్వం అంందించే సంక్షేమ పథకాల మొదలు.. వీధిలోని దేవాలయంలో దర్శనం నుంచి విదేశాలకు ప్రయాణం వరకూ అన్నింటికీ గుర్తింపు కార్డులు, ధ్రువపత్రాలు ఉండాల్సిందే. ఇక వ్యక్తిగత గుర్తింపు కార్డుల జారీకి అయితే బర్త్ సర్టిఫికేట్.. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సమయంలో డెత్ సర్టిఫికేట్ ఎంత అవసరమో అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి కీలకమైన జనన, మరణ ధ్రువపత్రాలు ఎప్పుడైనా అత్యవసరంగా కావాలంటే.. చాలా ప్రయాస, ప్రహసనంతో కూడుకున్న పని. ఇకపై ఆ ఇబ్బందులు తప్పనున్నాయి. కేంద్రం తీసుకువస్తున్న నూతన విధానం ద్వారా ఇక ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేవలం బటన్ నొక్కడం ద్వారా వీటిని నమోదు చేయవచ్చు.
ప్రస్తుతం అన్నీ మొబైల్ ద్వారానే జరిగిపోతున్నాయి. మొబైల్ యాప్ ఉంటే చాలు.. ఇంట్లో ఉండే అన్ని పనులూ చేసేయవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్రం కూడా ఇలాంటి ఆలోచన చేసింది. కేవలం బటన్ నొక్కడం ద్వారా జనన, మరణాలను నమోదుచేసేలా ఓ మొబైల్ యాప్ తీసుకువచ్చింది. పౌర నమోదు వ్యవస్థ (సీఆర్ఎస్) పేరుతో కేంద్ర రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా .. ఈ మొబైల్ అప్లికేషన్ రూపొందించింది. ఈ సీఆర్ఎస్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. త్వరలోనే ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే జనన, మరణాల నమోదుకు సమయం గణనీయంగా తగ్గిపోతుంది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిజిటల్ ఇండియాలో భాగంగా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించినట్లు హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. మరోవైపు రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ యాక్ట్ 1969 ప్రకారం దేశంలో సంభవించే ప్రతి జననం, మరణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రార్ జనరల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి దీనిని సమన్వయం చేస్తూ ఉంటుంది. అయితే జనన, మరణాల నమోదులో ఇబ్బందులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో సాంకేతికతను ఉపయోగించి.. సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ తీసుకువచ్చారు.