పోలవరం ఎత్తును పరిమితం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించట్లేదని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రానికి అన్యాయం చేసేలా ఉన్న కేంద్రం నిర్ణయంపై ఎందుకు నోరు మెదపడంలేదని అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. రాష్ట్రానికి ఇంతటి తీరని అన్యాయం చేస్తారా? పోలవరం ప్రాజెక్టు ఎత్తును పరిమితంచేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నా మీరు ఎందుకు నోరుమెదపడంలేదు? సవరించిన అంచనాలను ఆమేరకే పరిమితం చేయడం రాష్ట్రానికి తీరని అన్యాయం కాదా?
దీనివల్ల ప్రాజెక్టు లక్ష్యాలనే దెబ్బతీస్తున్నారు కదా? దేనికి లాలూచీపడి మీరు ఈ పనికి ఒడిగట్టారు? ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి, కేంద్ర మంత్రివర్గంలో మీ పార్టీ ఎంపీలు కూడా ఉండి ఎందుకు ఈ అంశంపై అభ్యంతరం చెప్పలేదు? చంద్రబాబుగారూ… ఎప్పుడు ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించినా రాష్ట్ర భవిష్యత్తును, ప్రజల భవిష్యత్తును తాకట్టుపెడతారని, మీ స్వార్థరాజకీయాలకు, ఆర్థిక, వ్యక్తిగత ప్రయోజనాలకోసం ప్రజల ప్రయోజనాలను నట్టేటా ముంచేస్తారని మరోసారి నిరూపిస్తున్నారుకదా? అని ప్రశ్నించారు.