కూటమిలో మూడు పార్టీలు ఉన్నందున నేతలు సర్దుకుపోవాలి. అక్కడక్కడా సమన్వయం పాటించకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. శుక్రవారం పిఠాపురం నియోజకవర్గంలో జరిగిన చిన్న సంఘటనే ఇందుకు ఉదాహరణ. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థికి సంబంధించిన సమావేశంలో కొంతమంది టీడీపీ నాయకులు జనసేన పార్టీ కండువా వేసుకోలేదు. దీంతో జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. వాస్తవంగా అయితే ఇది చాలా చిన్న సమస్య. ఎన్నికల సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కండువాలు అందరూ కప్పుకొన్నారు. ఇప్పుడు కూడా జనసేన శ్రేణులు అభ్యంతరం తెలపగానే టీడీపీ నాయకులు జనసేన పార్టీ కండువాలు ధరించి ఉంటే ఎలాంటి సమస్య ఉండేది కాదు. ఈ చిన్న విషయానికే ఇరువర్గాల వారికి మాటామాట పెరిగి రచ్చకెక్కారు. పెద్దాపురం నియోజవర్గంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది.
ఒక కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడి ఫొటో ముద్రించలేదనే విషయంలో స్థానిక ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలో తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివా్‌సకు వ్యతిరేకంగా కొంత మంది టీడీపీ నాయకులు నేరుగా రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడికి అనుకూలంగా మారిపోయారని ఆరోపణలు చేశారు. ఇలా చిన్న చిన్న సమస్యలను పెద్దవిగా చేసుకుని స్థానిక నాయకులు రచ్చకెక్కుతున్నారు. అలాగే కొన్ని పదవులు, చిన్న చిన్న కాంట్రాక్ట్ పనుల విషయంలో ఇరు పార్టీ నేతల మధ్య విభేదాలు వస్తున్నాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య సఖ్యత పూర్తిగా లోపించింది. అక్కడ టీడీపీ నాయకులు జనసేనకి చెందిన నాయకులను కనీసం పరిగణనలోకి తీసుకోకుండా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొంది అని లోగుట్టు సమాచారం.