గత ప్రభుత్వంలో సీఎం వైయస్ జగన్, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా, ప్రపంచస్థాయి ప్రమాణాలతో రుషికొండ పర్యాటక భవనాలు నిర్మిస్తే, ఇప్పుడు సీఎం చంద్రబాబు అవి చూసి ఓర్వలేక అక్కసు వెళ్లగక్కుతున్నారని వైయస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తేల్చి చెప్పారు.
14 ఏళ్లు సీఎంగా ఉన్న తాను, ఆ తరహా భవనం ఒక్కటి కూడా కట్టలేదన్న బాధ చంద్రబాబు మనసులో ఉందని ఆయన తెలిపారు. అందుకే ప్రజలను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పారు. అవి పర్యాటక శాఖ భవనాలని స్వయంగా ప్రొటోకాల్ విభాగం ప్రకటించినా, అవి జగన్ తన కోసం కట్టుకున్నారని, అది ప్యాలెస్ అని, విలాసవంతమైన భవన సముదాయమని, సొంత ఆస్తిలా నిర్మాణం చేసుకున్నారని అదే పనిగా అసత్యాలు చెబుతున్నారని గుర్తు చేశారు.