వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించడం దారుణమైన చర్యగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి అభివర్ణించారు. సోషల్ మీడియా కార్యకర్తలను నిర్బంధించడం అంటే వారి ప్రాథమిక హక్కులను కాలరాయడమే, రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడిచేయడమే. టీడీపీ నాయకుల ప్రభావంతో, రాజకీయ ప్రేరేపిత చర్యల్లో భాగంగా సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టుచేసి, కస్టడీలో వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించడం అన్నది అన్ని ప్రజాస్వామ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే. పోలీసుల అధికార దుర్వినియోగం క్షమించరానిది. భావవ్యక్తీకరణ హక్కులకు విరుద్ధమైనది. ఈ రాజకీయ ప్రేరేపిత చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.
తక్షణమే వీటిని ఆపకపోతే సోషల్ మీడియా కార్యకర్తల హక్కులను పరిరక్షించడానికి, చట్టపరమైన చర్యలను తీసుకోవడానికి వెనుకాడబోమని వైయస్ జగన్ హెచ్చరించారు. కాగా, చంద్రబాబు ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. వినుకొండ, గుడివాడ, భీమవరం, ఉదయగిరి, నెల్లూరు, పెనుగొండ, నందిగామ సహా అనేక ప్రాంతాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అండగా నిలిస్తోంది అని హామీ ఇచ్చారు.