ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్ (ఐఆర్‌ఏఎస్) అధికారి, రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణపై విచారణకు రంగం సిద్ధమైంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఆయన వైసీపీ నేతలకు నిధులు దోచిపెట్టారని, ప్రభుత్వ అధికారిలా కాకుండా వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారని ఆరోపిస్తూ.. బీజేపీ అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ కేంద్ర సిబ్బంది-శిక్షణ శాఖ (డీవోపీటీ)కు ఇటీవల ఫిర్యాదు చేశారు. దీనిపై ఆ శాఖ స్పందించి.. పరిశీలించాలని రాష్ట్ర సాధారణ పరిపాలన విభాగాన్ని (జీఏడీ) ఆదేశించింది. ఈ మేరకు జీఏడీలో ఫైలు సిద్ధమైంది. దీంతో తనను తక్షణమే రిలీవ్ చేయాలని కోరుతూ సత్యనారాయణ గత నెల 29వ తేదీన రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్‌ను కోరారు.
రాష్ట్రంలో 2019-24 మధ్యకాలంలో బిల్లుల చెల్లింపు పేరుతో వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలకు, జగన్ చెప్పిన వారికి నిబంధనలకు విరుద్ధంగా పందేరం చేశారని రమేశ్ తన ఫిర్యాదులో ఆరోపించారు. ‘మొదట నమోదైన బిల్లులకు మొదటే చెల్లింపులు జరపాలన్న ఫిఫో నిబంధనలను ఆయన ఉల్లంఘించారని, దీంతో జగన్ హయాంలో చెల్లింపుల విధానాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో 4 లక్షల పిటిషన్లు నమోదయ్యాయని తెలిపారు. భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్వారా రాష్ట్రప్రభుత్వం బాండ్లు వేలం వేసి తెచ్చిన రూ.4,000 కోట్ల అప్పును వైసీపీ నేతల బినామీ కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సత్యనారాయణ వాటిని దారి మళ్లించారని ఆరోపించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజున కూడా కోర్టుల్లో అమరావతికి వ్యతిరేకంగా, జగన్ కేసుల్లో ఆయన తరఫున వాదించిన లాయర్లకు సత్యనారాయణ బిల్లులు చెల్లించారని.. ఈ ఉల్లంఘన లన్నింటికీ సత్యనారాయణే కారణమని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి ఇన్ని ఆర్థిక అక్రమాలకు కారణమైన సత్యనారాయణపై గట్టి చర్యలు తీసుకోవాలని రమేశ్ డీవోపీటీ అడ్మిన్ డైరెక్టర్‌ను కోరారు.