దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2047 కల్లా భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా హైస్పీడ్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ, స్ట్రాటజిక్, ఇంటర్‌నేషనల్ కనెక్టివిటీ, లింక్, ఫీడర్ రోడ్లన్నింటినీ కలిపి దాదాపు 59 వేల కిలోమీటర్ల మేర నిర్మాణాలను చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. విజన్-2047లో భాగంగా చేపడుతున్న ఈ నిర్మాణాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పలు ప్రాజెక్టులు మంజూరు కానున్నాయి.
ప్రాథమిక నివేదిక ప్రకారం ఏపీ, తెలంగాణ మీదుగా పలు హై స్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. ఏపీలో పోర్టులు ఉండడంతో వాటిని అనుసంధానించేలా పలు రహదారులు, రెండు రాష్ట్రాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఇరుకుగా ఉన్న రోడ్లను వెడల్పు చేయడంతోపాటు మిస్సింగ్ లింక్ రోడ్లను నిర్మించనున్నారు. స్ట్రాటజికల్, ఇంటర్నేషనల్ రోడ్ల కనెక్టివిటీ కింద తెలుగు రాష్ట్రాల్లో ఒక్క రోడ్డు లేకపోవడం గమనార్హం. హైస్పీడ్ కారిడార్లలో ఆంధ్రప్రదేశ్‌కు 9, తెలంగాణకు 6-7 (తెలంగాణ మీదుగా ఏపీకి కొన్ని రోడ్లున్నాయి) రానున్నాయి. ఏపీలో పోర్టు కనెక్టివిటీ రోడ్లు 8 వరకు ఉన్నాయి. ఇక పట్టణ ప్రాంతాల్లోని ఇరుకు రోడ్లను వెడల్పు చేసే ప్రాజెక్టులు ఏపీలో 04, తెలంగాణలో 3 చోట్ల ఉన్నాయి. మిస్సింగ్ లింక్, అఽధిక రద్దీ ఉన్న ప్రాంతాల్లో చేపట్టే రహదారుల నిర్మాణాల ప్రాజెక్టుల్లో ఏపీకి 07, తెలంగాణకు 4 చొప్పున ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నింటినీ రెండు దశల్లో నిర్మించనున్నారు. కేంద్ర క్యాబినెట్‌లో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించిన తర్వాత నిర్మాణ వ్యయం, భూ సేకరణ, రూట్‌మ్యా్‌పలపై స్పష్టత రానుంది.