ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పదవులు పొందిన 59 మందికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వారికి దిశానిర్దేశం చేశారు. పదవులను బాధ్యతగా భావించి ప్రజల కోసం పనిచేయాలని ఆయన వారికి సూచించారు. పోరాటం, కష్టం, త్యాగం, పనితీరు, విధేయత, క్రమశిక్షణ ఆధారంగా పదవులు ఇచ్చినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో వేధింపులకు గురైన పార్టీ నేతలు, కార్యకర్తలు, మహిళలు, యువతకు అవకాశం కల్పించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు.
అలాగే సమర్థత నిరూపించుకున్న బూత్ స్థాయి కార్యకర్తలకూ రాష్ట్రస్థాయి పదవులు కేటాయించినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దాదాపు 30 వేల దరఖాస్తులు పరిశీలించి తగిన వ్యక్తులకు తగిన విధంగా పదవులు ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. పొలిటికల్ గవర్నెన్స్‌లో భాగంగా ఎంపికలు జరిగాయని సీఎం వెల్లడించారు. పదవులు పొందిన ప్రతి ఒక్కరూ కూటమి పార్టీలకు, ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని సీఎం చంద్రబాబు వారికి సూచించారు.