ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త దివంగత డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు పేరు పెట్టడం హర్షనీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. డా.ఎల్లాప్రగడ సుబ్బారావు పెడుతూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం సంతోషకరమని ఉప ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్లాప్రగడ పేరును తాను ప్రతిపాదించగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించడం అభినందనీయమని పవన్ చెప్పుకొచ్చారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆ శాఖ ఉన్నతాధికారులు ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు శాస్త్రవేత్త ఎల్లాప్రగడ పేరు పెట్టడం హర్షనీయమని పవన్ అన్నారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి సత్యకుమార్, ఆ శాఖ ఉన్నతాధికారులకు సైతం పవన్ కృతజ్ఞతలు తెలిపారు. క్యాన్సర్, ఫైలేరియా, క్షయ వ్యాధుల నివారణకు ఎల్లాప్రగడ ఔషధాలను కనుగొన్నారని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. తొలి టెట్రాసైక్లిన్ యాంటీ బయోటిక్ ఆవిష్కరణలతో ఆయన ప్రపంచ ఖ్యాతి పొందారని చెప్పుకొచ్చారు. ప్రపంచానికి ఎల్లాప్రగడ చేసిన సేవలు, మేలునీ కూటమి ప్రభుత్వం చిరస్మరణీయం చేసిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.