అటవీ శాఖ అధికారులు ఎందరో స్మగ్లర్ల చేతిలో ప్రాణాలు కోల్పోయారని.. అనేక మంది తీవ్రమైన దెబ్బలు తిన్నారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. గుంటూరులో పవన్ కల్యాణ్ పర్యటించారు. గుంటూరు అరణ్యభవన్‍లో అటవీ అమరవీరుల సంస్మరణ సభ ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విధుల్లో ప్రాణాలు అర్పించిన అధికారులు, సిబ్బందికి పవన్ కల్యాణ్ నివాళులు అర్పించారు.
అమరవీరుల కుటుంబ సభ్యులను పేరుపేరునా పవన్ కల్యాణ్ పలకరించారు. స్మగ్లర్‌ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన 23మంది ఐ.ఏఫ్.యస్ అధికారుల కుటుంబ సభ్యులకు సాయం అందించారు. వీరిలో అన్ని కేటగిరీల సిబ్బంది, అధికారులు ఉన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... అడవులను సంరక్షించడంలో ఐ.ఏఫ్.యస్ అధికారుల పాత్ర కీలకమని కొనియాడారు. వీరప్పన్ వంటి వారితో పోరాటం చేసిన ఐ.ఏఫ్.యస్ అధికారులు ఉన్నారని గుర్తుచేశారు. వన్య సంపద, వన్య ప్రాణులను కాపాడారని ప్రశంసించారు. ఈ స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించేలా తమ వంతుగా కృషి చేస్తామని పవన్ కల్యాణ్ అన్నారు.