ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. త్వరలోనే మరో కొత్త ట్రైన్ మార్గం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాలకు ట్రైన్ కనెక్టివిటీ ఉండగా.. రాష్ట్రంలో మరో మార్గం కూడా అందుబాటులోకి రానుంది. రాజధాని అమరావతి మీదుగా ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకు ఈ ట్రైన్ మార్గం ఏర్పాటు చేయనున్నారు. మెుత్తం 56.63 కిలోమీటర్ల ట్రైన్ మార్గం నిర్మాణం కోసం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో భూసేకరణకు తాజాగా.. రైల్వేశాఖ నోటిఫికేషన్ జారీచేసింది. ఏపీలోని రాజధాని అమరావతిని ట్రైన్ మార్గం ద్వారా కనెక్ట్ చేయటానికి ఎర్రుపాలెం-నంబూరు స్టేషన్ల మధ్య అమరావతి మీదుగా కొత్తగా నిర్మిస్తున్న బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం కోసం ఎన్టీఆర్ జిల్లాలో భూసేకరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
ఇబ్రహీంపట్నం మండలం దాములూరులోని 20 సర్వే నంబర్లలోని 12.59 ఎకరాలు, చిలుకూరులోని 42 సర్వే నెంబర్‌లోని 24.540 ఎకరాలు కలిపి మొత్తం 37.13 ఎకరాల కోసం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ శనివారం (నవంబర్ 9) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భూసేకరణపై ఏవైనా అభ్యంతరాలు, సలహాలు, సూచనల ఉంటే.. 30 రోజుల్లోపు విజయవాడ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కు లిఖితపూర్వకంగా అందజేయాలని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అభ్యంతరాల స్వీకరణ అనంతరం విచారణ చేపట్టి సదరు అధికారి జారీచేసే ఉత్తర్వులే ఫైనల్ అని స్పష్టం చేశారు. ఈ నోటిఫికేషన్‌లో పేర్కొన్న భూముల ప్లాన్లు, ఇతర వివరాలు విజయవాడ ఆర్డీవో ఆఫీసులో అందుబాటులో ఉంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు పరిశీలించుకోవచ్చని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు.
విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై అప్‌డేట్
ఇక చంద్రబాబు ప్రభుత్వం ఏపీలో మెట్రో ప్రాజెక్టుల విషయంలో వేగం పెంచిన విషయం తెలిసిందే. రాజధాని అమరావతి నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణంపైనా దృష్టి సారించింది. ఇప్పటికే విజయవాడ మెట్రో ప్రాజెక్టుపై మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కేంద్రానికి ప్రతిపాదనలు సైతం పంపారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలోనే విజయవాడ మెట్రో ప్రాజెక్టు నిర్మాణానికి ప్రతిపాదనలు పంపగా.. ఆ తర్వాత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవటంతో మెట్రో నిర్మాణం దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు.
విజయవాడ మెట్రో మొదటి దశలో 38.40 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం జరగనుంది. గన్నవరం నుంచి పీఎన్బీఎస్ వరకు 26 కిలోమీటర్ల మేరకు మొదటి కారిడార్, పీఎన్బీఎస్ నుంచి పెనమలూరు వరకూ 12.5 కిలోమీటర్ల మేర రెండో కారిడార్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మొత్తం 21 స్టేషన్లు, ఒక అండర్ గ్రౌండ్ స్టేషన్ మొదటి దశలో నిర్మించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. తొలిదశ నిర్మాణం కోసం 11 వేల కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.