నంద్యాల జిల్లా శ్రీశైలం పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. పున్నమిఘాట్ వద్ద విజయవాడ శ్రీశైలం సీ ప్లేన్ సర్వీస్ ప్రారంభించిన తర్వాత సీఎం చంద్రబాబు.. సీ ప్లేన్‌లోనే శ్రీశైలం వెళ్లారు. మల్లిఖార్జున స్వామిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమకు త్వరలోనే శుభవార్త చెప్తామన్న చంద్రబాబు.. అది కనుక సక్సెస్ అయితే రాయలసీమ రతనాలసీమగా మారిపోతుందన్నారు. రాయలసీమకు ఉన్న వనరులు ఎక్కడా లేవన్న చంద్రబాబు.. సోలార్, విండ్ ఎనర్జీ అన్ని పుష్కలంగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో రాయలసీమ జిల్లాలకు చంద్రబాబు చెప్పబోయే గుడ్ న్యూస్ ఏంటా అనేదానిపై చర్చ జరుగుతోంది.
అయితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పబోయేది టెస్లా గురించేనంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇటీవలే మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. అమెరికాలో పర్యటించిన నారా లోకేష్.. ఆస్టిన్‌లోని టెస్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. టెస్లా సీఎఫ్‌వో వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎలక్ర్టానిక్ వాహనాల తయారీ సంస్థలకు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను మంత్రి నారా లోకేష్ వారికి వివరించారు. ముఖ్యంగా రాయలసీమలోని అనంతపురం జిల్లా ఎలక్ట్రానిక్ వాహనాలు, బ్యాటరీ యూనిట్స్ తయారీకి అనువైన ప్రదేశంగా నారా లోకేష్.. టెస్లా యాజమాన్యానికి వివరించారు.
2029 నాటికి 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనాన్ని ఉత్పత్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్న నారా లోకేష్.. ఈ లక్ష్యాన్ని సాకారం చేసేందుకు టెస్లా వంటి ప్రపంచస్థాయి సంస్థల సహకారం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆటోమొబైల్ పరిశ్రమను అభివృద్ధి చేయడంలో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషిని టెస్లా యాజమాన్యానికి వివరించిన నారా లోకేష్.. కియా, హీరో మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో ప్లాంట్లు ఏర్పాటు చేసిన విషయాన్ని వారికి వివరించారు.
అనంతపురంలో టెస్లా కంపెనీ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు అనంతపుపంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటు విషయంలో ఏదైనా కీలక ప్రకటన చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అనంతపురం జిల్లాలో ఇప్పటికే కియా మోటార్స్ ప్లాంట్ ఉండగా.. టెస్లా కూడా వస్తే కరువు సీమలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నెటిజనం అభిప్రాయపడుతున్నారు.