తిరుపతి జిల్లా పుత్తూరులో నకిలీ నోట్లు ముద్రించే వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ వివరాలను పుత్తూరు డీఎస్పీ రవికుమార్ ఆదివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మునికృష్ణారావుకు ఫేస్బుక్ ద్వారా తిరుపతిలోని రమే్షతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ కలిసి రమేష్ ఇంట్లో షేర్ మార్కెట్ బిజినెస్ చేసేవారు. ఇందులో నష్టాలు వచ్చాయి. దీంతో డబ్బు సంపాదనకు అడ్డమార్గం ఎన్నుకున్నారు. కరెన్సీ నోట్లను ముద్రించే విధానాన్ని యూట్యూబ్లో తెలుసుకున్నారు. దీనికి రమేష్ భార్య సంధ్య, కుమార్తె ఇషా తోడయ్యారు. వీరు నలుగురు తిరుపతిలోనే నోట్ల ముద్రణకు కావాల్సిన వస్తువులను కొని ఇంట్లోనే ముద్రించేవారు.
ఆ దొంగ నోట్లతో శ్రీకాళహస్తి, తిరుపతి, రేణిగుంట, పుత్తూరులో వస్తువులను కొనుగోలు చేస్తూ మార్చేవారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం రమేష్, ఇషా పుత్తూరు పట్టణం మండివీధిలోని నిర్మల ప్రొవిజన్ స్టోర్, జగన్నాథం ప్రొవిజన్ స్టోర్, శ్రీకృష్ణ స్టోర్స్, శంకర్ దుకాణాలు వంటి పలు దుకాణాల్లో తమ వద్ద నున్న రూ.500 నోట్లతో పలు వస్తువులను కొనుగోలు చేశారు. వారిచ్చిన నోట్లను ఒక దుకాణాదారుడు కరెన్సీ యంత్రంలో లెక్కించగా అది దొంగనోట్లుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పుత్తూరు సీఐ సురేంద్ర నాయుడు ఆధ్వర్యంలో సిబ్బంది ఆ దుకాణం వద్దకు వెళ్లి సీసీ కెమెరా ద్వారా దొంగనోట్లను ఇచ్చిన వారిని గుర్తించారు. వెంటనే అరెస్ట్ చేసి దర్యాపు ప్రారంభించారు.