విజయనగరం జిల్లా, గరుగుబిల్లి పరిధిలోని పెదగుడబ గ్రామంలో ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన పత్తిగోల రమేష్‌కు చెందిన కిరాణా దుకాణం పూర్తిగా అగ్నికి ఆహుతయ్యింది. షార్ట్ సర్క్యూట్ కావడంతో ఈ ప్రమాదం నెలకొందని గ్రామస్థులు తెలిపారు. దుకాణంలో రెండు ఫ్రిజ్‌లు, మూడు తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయలు నగదుతో పాటు పలు రకాల వస్తువులు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న పార్వతీ పురం అగ్నిమాపక సిబ్బందికి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. తమ జీవనాధారం కోల్పోవడంతో రమేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఆర్‌ఐ శ్రీనివాస్ గౌరీప్రసాద్, వీఆర్వో కిరణ్‌కుమార్, కార్యదర్శి అల్లు రమేష్‌తో పాటు పలువురు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రూ.6లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు.