విశాఖ కేజీహెచ్ ఆవరణలో మహిళా వైద్య విద్యార్థుల హాస్టల్ వెనుకవైపు గంజాయి మొక్కలు లభ్యమైన కేసులో వన్‌టౌన్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. రెండు గంజాయి మొక్కలను ఏవీఎన్ కాలేజీ సమీపంలోని కోడిపందాలవీధికి చెందిన ఐదుగురు యువకులు పెంచుతున్నట్టు పోలీసులు దర్యాప్తులో నిర్ధారించిన విషయం తెలిసిందే. ఈ సంఘటన నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.
గంజాయి మొక్కల పెంపకంలో ప్రమేయం కలిగివున్న ఒక జువైనల్‌తో పాటు మరో ఇద్దరు యువకులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉండడంతో వారి కోసం గాలిస్తున్నారు. ఇదిలావుండగా గంజాయి మొక్కలను నగరంలో ఇంకా ఎక్కడైనా పెంచే అవకాశం ఉందా? అనే దానిపై శివారుప్రాంతాలు, నిర్మానుష్యంగా ఉండే ప్రాంతాల్లో క్షుణ్నంగా తనిఖీ చేయాలని అన్ని స్టేషన్ల సీఐలను ఉన్నతాధికారులు ఆదేశించారు. అలాగే గంజాయి వినియోగంపైనా పటిష్ఠ నిఘా ఉంచాలని ఆదేశించడంతో నగరంలోని నిర్మానుష్యప్రాంతాలపై పోలీసులు దృష్టిసారించారు.