మాకు ఎలాంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. కేవలం మార్కాపురం సమగ్రాభివృద్ధే మా లక్ష్యం. అందుకను గుణంగానే ఆక్రమణల తొలగింపులు చేపట్టాం. మీ పార్టీలాగా మాకు విధ్వంసం సృష్టించడం చేతకాదు. అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయం’ అని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక జవహర్‌నగర్ కాలనీలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆయన విలేకర్లతో మాట్లాడారు. మార్కాపురం మున్సిపాలిటీలో జరుగుతున్న ఆక్రమణల తొలగింపు విషయంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు శనివారం చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కాపురాన్ని సుందరంగా తీర్చిదిద్దడం మీకు ఇష్టం లేదా? అని ప్రశ్నించారు.
మున్సిపల్ అధికారులు చట్ట ప్రకారం ముందుగా నోటీసులు ఇచ్చి, కొంత సమయాన్ని కూడా ఇచ్చి ఆక్రమణల తొలగింపు ప్రారంభించారన్నారు. కేవలం రహదారి ఆక్రమణలు మాత్రమే అధికారులు తొలగిస్తున్నారన్నారు. కనీస అనుమతులు తీసుకోకుండా డీకే పట్టా భూముల్లో నిర్మించిన భవనాల నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఒక సర్వే నంబరు చూపి, మరో సర్వే నంబరులో భవనాల నిర్మాణాలు ఉన్నాయన్నారు. ఇవన్ని చట్ట సమ్మతం కాదన్నారు. అయితే మానవతా దృక్పథంలో వాటి జోలకి వెళ్లడం లేదన్నారు. కక్ష సాధిపు దోరణి తమది కాదన్నారు. పట్టణ సుందరీకరణ కోసం ముందుకు పోతుంటే తమపై విమర్శలు చేయడం సబబు కాదన్నారు. మీకు చేతనైతే మున్సిపాలిటీకి వెళ్లి రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు.