ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ఆర్ మానసపుత్రికకు ఆపదొచ్చింది: వైఎస్ షర్మిల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2024, 07:47 PM

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోషల్ మీడియా వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు గుప్పించారు. వైసీపీ విధానాలపైనా, వైఎస్ జగన్ తీరుపైనా విమర్శలు గుప్పించే షర్మిల.. ఈసారి టీడీపీ కూటమి సర్కారు తీరును ఎండగట్టారు. విపత్కర పరిస్థితుల్లో సకాలంలో ఆస్పత్రికి చేరుస్తూ ఎంతోమంది ప్రాణాలు నిలబెట్టిన 108 అంబులెన్సులకు కూటమి ప్రభుత్వంలో ఆపద వచ్చిందంటూ షర్మిల ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మానస పుత్రిక అయిన 108 అంబులెన్సులకు ఆపద వచ్చిందని.. ప్రతీకార రాజకీయాలకు ఈ వ్యవస్థను వాడుకుంటున్నారంటూ షర్మిల మండిపడ్డారు. 108 ఉద్యోగులు.. షర్మిలను కలిసి తమ పోరాటానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల ఈ ట్వీట్ చేశారు.


 " అపర సంజీవని 108 అంబులెన్స్‌లకు కూటమి ప్రభుత్వంలో ఆపద వచ్చిపడింది. ఫోన్ కొడితే కుయ్ కుయ్ మంటూ క్షతగాత్రుల వద్దకు చేరే ఆరోగ్య ప్రదాయిని మూగబోతోంది. అత్యవసర పరిస్థితిలో ప్రాణాలకు అండగా నిలిచే అంబులెన్స్ వ్యవస్థను ప్రతీకార రాజకీయాలకు వాడుకుంటున్నారు. వాహనాల్లో డీజిల్ పోయకుండా, మెడికల్ పరికరాలు సమకూర్చకుండా, రిపేర్లు వస్తే చేయించకుండా వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. ఇంధనం లేదని గత నెల 140 వాహనాలు ఆపడం ఏంటి? 90 వాహనాలు ఇప్పటికీ రిపేర్లు ఉన్నా పట్టించుకు పోవడం ఏంటి?" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.


" మహానేత వైఎస్ఆర్ మానస పుత్రిక 108 అంబులెన్స్. వైఎస్ఆర్ దూర దృష్టికి నిదర్శనం. దేశంలో ఎన్నో రాష్ట్రాలకు 108 వ్యవస్థ ఆదర్శం. లక్షలాది మంది ప్రాణాలు కాపాడిన సంజీవని. ఇలాంటి వ్యవస్థకు ప్రభుత్వాలు మారినప్పుడల్లా గ్రహణం పడుతోంది. నేడు 108 ఉద్యోగ సంఘాలు నేతల మమ్మల్ని కలవడం జరిగింది.108 వ్యవస్థలో నెలకొన్న సమస్యలను వివరించడం జరిగింది. ఎవరు అధికారంలో ఉన్నా.. అంబులెన్స్ ఆగకుండా ఉండాలంటే వ్యవస్థను పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేస్తే బాగుంటుందని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 25 నుంచి తలపెట్టిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరినా.. అంబులెన్స్‌లు ఆగితే నష్టం ప్రజలకే. ఉద్యోగుల డిమాండ్ న్యాయబద్ధమైనదే కాబట్టి వెంటనే చర్చలకు పిలిచి సమస్యలు పరిష్కరించాలని, 108 వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది" అంటూ షర్మిల ట్వీట్ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com