నెల్లూరు జిల్లా, ముత్తుకూరు పోలీస్‌స్టేష్‌న్‌లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పోలీస్ విచారణ ముగిసింది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై అసత్య ఆరోపణలు, కార్టూన్లను సోషల్ మీడియాలో ప్రచారం చేయడంపై కాకణిపై కేసు నమోదు అయ్యింది. ఈ క్రమంలో పది రోజుల క్రితమే విచారణకు హాజరుకావాలని మాజీమంత్రికి కృష్ణపట్నం సర్కిల్ పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో ఈరోజు (బుధవారం) ఉదయం ముత్తుకూరు పోలీస్‌స్టేషన్‌కు కాకాణి గోవర్ధన్ విచారణకు హాజరయ్యారు. కృష్ణపట్నం సర్కిల్ సీఐ రవి నాయక్ సమక్షంలో మాజీ మంత్రి విచారణకు హాజరయ్యారు. ఈరోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు పోలీసు విచారణకు కాకాణి హాజరుకాగా.. దాదాపు రెండున్నర గంటల పాటు విచారణ కొనసాగింది.
కృష్ణపట్నం సర్కిల్ సీఐ, రవి నాయక్ ముత్తుకూరు ఎస్సై విశ్వనాథ్ రెడ్డి మరో ఇద్దరు పోలీస్ సిబ్బంది విచారణలో పాల్గొన్నారు. విచారణలో దాదాపు 54 ప్రశ్నలను మాజీ మంత్రి కాకాణిని పోలీసులు అడిగారు. అయితే కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పి మరి కొన్ని ప్రశ్నలకు కాకణి సరైన సమాధానం చెప్పనట్టు తెలుస్తోంది. అయితే పోలీసు విచారణకు సందర్భంగా పెద్ద సంఖ్యలో తన కార్యకర్తలతో కలిసి కాకాణి పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరకు కాకాణి ఒక్కరినే పోలీసులు స్టేషన్‌లోకి అనుమతించారు.