విజయవాడ నగరంలో భూ కబ్జా వ్యవహారంలో ఓ వైసీపీ నేత అడ్డంగా బుక్కయ్యాడు. స్థల యజమానిపై హత్యాయత్నం చేసేందుకు సుపారీ ఇచ్చి రౌడీలను కేటాయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు గుర్తించారు. ఆ వైసీపీ నేత పరారీలో ఉండగా పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడలో ఉమామహేశ్వరశాస్త్రి అనే వ్యక్తికి విలువైన స్థలం ఉంది. దానిపై వైసీపీ రాష్ట్రస్థాయి నేత గౌతమ్ రెడ్డి కన్నుపడింది. దీంతో అతని స్థలం కబ్జా చేసి బెదిరింపులకు దిగాడు గౌతమ్ రెడ్డి. స్థలం తనకు ఇచ్చేయాలని, లేకుంటే ప్రాణాలు తీస్తానని పలుమార్లు హెచ్చరించాడు. అయితే ఎంత బెదిరించినా బాధితుడు ఉమామహేశ్వరశాస్త్రి మాత్రం తన భూమిని ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో అతనిపై హత్యాయత్నం చేసేందుకు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి నిశ్చయించుకున్నాడు.
అనంతరం జగ్గయ్యపేట మండలం చిల్లకల్లుకు చెందిన గ్యాంగ్‌కు రూ.24 లక్షలు సుపారీ ఇచ్చాడు. స్థల యజమాని కాళ్లు, చేతులు విరిచేయాలని వారికి చెప్పాడు. విషయం తెలుసుకున్న బాధితుడు ఈనెల 6న విజయవాడ సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ నేత వల్ల తనకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదు చేశారు. అయితే గౌతమ్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విచారణలో సుపారీ విషయాన్ని గుర్తించారు. గౌతమ్ రెడ్డి సుపారీ ఇచ్చిన విషయం నిజమేనని తేల్చారు. గ్యాంగ్‌కు సుపారీ ఇస్తుండగా రికార్డయిన సీసీ టీవీ ఫుటేజ్‌ని సేకరించారు. దాడి చేసేందుకు ఒప్పందం చేసుకున్న నలుగురు గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేశారు. అయితే గ్యాంగ్ సభ్యులను అరెస్టు చేయడంతో అప్రమత్తమైన గౌతమ్ రెడ్డి పరారయ్యాడు. దీంతో అతన్ని పట్టుకునేందుకు విజయవాడ సీపీ రాజశేఖర బాబు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. గౌతమ్ రెడ్డి కోసం పోలీసులు రెండు తెలుగు రాష్ట్రాలనూ జల్లెడపడుతున్నారు.