కొద్దిరోజుల కిందట పోలీసుల తనిఖీలో నేపథ్యంలో గంజాయితో వాహనాన్ని వదిలేసి పరారైన దొంగలు ఎట్టకేలకు చిక్కారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఇద్దరు గంజాయి అక్రమ రవాణా చేయగా.. వారికి అక్కడి హోంగార్డు ఒకరు సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేసి.. వారి నుంచి 563 కేజీల గంజాయి నిల్వలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం శ్రీకాకుళంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. గత నెల 24న మెళియాపుట్టి పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు.
ఓ బొలెరో(ఓఆర్ 18ఏ5409) వాహనం ఆపకుండా వెళ్లిపోతూ.. మెళియాపుట్టి మండలం జాడుపల్లి వద్ద ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. పోలీసులు అక్కడికి చేరుకోగా గుర్తుతెలియని వ్యక్తులు ఆ వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. పోలీసులు ఆ వాహనాన్ని తనిఖీ చేయగా.. 16 బస్తాలో 563.920 కేజీల గంజాయి పట్టుబడింది. సాంకేతికత ఆధారంగా పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. ఒడిశా రాష్ట్రం రాయఘడ జిల్లా పిండాగుడి గ్రామానికి చెందిన ఆయూబ్‌మాజి.. గంజాయి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. గజపతి జిల్లా శాంతినగర్ కాలనీకి చెందిన రంజిత్ బర్దన్ అలియాస్ దురబర్దన్ గంజాయి సమకూర్చినట్టు తెలుసుకున్నారు. వీరిద్దరికీ ఒడిశాలో పనిచేస్తున్న హోంగార్డు అభిమజ్జి సహకరించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ముగ్గురూ గజపతి జిల్లా అటవీ ప్రాంతం ఉటుక గ్రామం నుంచి గంజాయిని పలాసకు చేర్చి అక్కడ నుంచి ఓ కంటైనర్‌లో తమిళనాడుకు తరలించేందుకు యత్నించారు. ఈక్రమంలో ప్లానింగ్ బెడిసికొట్టగా.. పోలీసులు రెండు వారాలుగా వీరికోసం గాలించి పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని, గంజాయి నిల్వలు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ మహేశ్వరరెడ్డి తెలిపారు.