గత వారం రోజులుగా ‘సీ ప్లేన్’ గురించి రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. విజయవాడ నుంచి శ్రీశైలానికి తొలి సీ ప్లేన్‌ను విజయవంతంగా నడిపారు. సీ ప్లేన్‌లో పది మంది నుంచి 20 మందిని ఒకేసారి తీసుకువెళ్లే సౌలభ్యం ఉంది. దీనిని ఇతర ప్రాంతాల్లో కూడా నడుపుతామని కేంద్ర విమానయాన శాఖా మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు. వాస్తవానికి సీ ప్లేన్ నడపాలనే ప్రతిపాదన విశాఖపట్నంలో ఎనిమిదేళ్ల క్రితమే వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2016 జనవరిలో ఇక్కడ జరిగిన సీఐఐ పెట్టుబడిదారుల సదస్సులో దీనిపై చర్చ జరిగింది. చెన్నైకు చెందిన స్కై చాపర్స్ అనే సంస్థ విశాఖపట్నంలో హెలికాప్టర్లతో పాటు సీ ప్లేన్లను కూడా నడుపుతామని ముందుకువచ్చింది.
భీమిలి తీరం నుంచి విజయవాడ ప్రకాశం బ్యారేజీకి సీ ప్లేన్ నడుపుతామని ప్రకటించింది. ఆ తరువాత జరిగిన చర్చల ఫలితంగా వుడా (వీఎంఆర్‌డీఏ) హెలీ టూరిజం నిర్వహించింది. బసంత్‌కుమార్ కమిషనర్‌గా ఉన్నప్పుడు వుడా పార్కు నుంచి రుషికొండ వరకు హెలికాప్టర్ నడిపారు. కొద్దిరోజులు నడిపిన తరువాత తూర్పు నౌకాదళం రక్షణ పరమైన అభ్యంతరం వ్యక్తం చేయడంతో నిలిపివేశారు. ఆ సమయంలోనే పర్యాటక సంస్థలతో సమావేశం నిర్వహించగా, చంద్రశేఖర్ అనే పారిశ్రామికవేత్త సీ ప్లేన్ నడుపుతామని ఆసక్తి వ్యక్తంచేశారు. తమకు భీమిలి సమీపాన మంగమారిపేటలో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మిస్తే సీ ప్లేన్ నడుపుతామన్నారు. ఈ నేపథ్యంలో మూడు నెలల్లో ఫ్లోటింగ్ జెట్టీ నిర్మించాలని 2016లోనే చంద్రబాబు ఆదేశించారు. అది కూడా కార్యరూపం దాల్చలేదు.