తన మేనిఫెస్టోతో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల్ని పదే పదే మోసం చేస్తుందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మండిపడ్డారు. మెడికల్ కాలేజి నిర్మాణాలపై గురువారం మండలిలో చర్చ జరిగింది. చర్చలో ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మాట్లాడారు. మంత్రి సత్యకుమార్ వ్యాఖ్యలకు నిరసనగా వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6నెలల కాలంలో కుటుంబానికి ఇచ్చింది ఒక్క సిలిండరే. మూడు సిలిండర్లు ఇస్తామని చెప్పిన మీరు ఒక్క సిలిండరే ఎందుకు ఇచ్చామన్నా ప్రశ్నిస్తున్నా మంత్రి సత్యకుమార్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.
సిలిండర్ ఉచితం అన్నప్పుడు డబ్బుల్ని లబ్ధి దారుడికి ఇవ్వాలి. లేదంటే వారి అకౌంట్‌లో డిపాజిట్ చేయాలి. అలా కాకుండా గ్యాస్ ఏజెన్సీలకు డబ్బులు ఎందుకు చెల్లిస్తున్నారు. ఇందులో ఏదో మతలబు దాగుందని లబ్ధి దారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఈ విధానంపై టీడీపీ నేత జ్యోతుల నెహ్రు సైతం వ్యతిరేకించారు. సొంత పార్టీ నేతలే అనుమానం వ్యక్తం చేశారంటే ఈ పథకం లోపభూయిష్టంగా ఉన్నాయన్నది అర్ధమవుతుందని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి అన్నారు.