ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూళ్ల ఆవరణలో రాజకీయ సమావేశాలు, మతపరమైన కార్యక్రమాలు, వివాహాలకు అనుమతిని ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టకూడదన్న ఏపీ విద్యాశాఖ.. అలాంటి వాటికి అనుమతిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది.
మరోవైపు పాఠశాలల పనివేళల కంటే ముందు, స్కూలు పూరైన తర్వాత, సెలవు రోజుల్లో పాఠశాలల ప్రాంగణాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. రాజకీయ పార్టీల సమావేశాలతో పాటుగా.. మతపరమైన కార్యక్రమాలు, పెళ్లిళ్లు జరుగుతుండేవి. స్కూల్ హెడ్మాస్టర్లతో పాటుగా స్థానిక అధికారుల అనుమతితో ఇలాంటి పనులకు స్కూళ్లను ఉపయోగిస్తున్నారని విద్యాశాఖకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలోనే వీటిపై నిషేధం విధిస్తూ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని జిల్లాలలోని అధికారులకు విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఉత్తర్వులలో స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఆర్జేడీలు, డీఈవోలు దీనిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభం కావటానికి ముందు లేదా తర్వాత, సెలవు రోజుల్లోనూ ప్రైవేట్ కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు స్పష్టం చేశారు. ఆదేశాలు ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని విద్యాశాఖ డైరెక్టర్ విజయ్ రామరాజు హెచ్చరించారు. మరోవైపు స్కూళ్ల ఆవరణలో ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ కారణంగా విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటుందని.. అలాగే పాఠశాలల నిర్వహణకు కూడా ఇబ్బందులు వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది కలిగించే ఇలాంటి కార్యక్రమాలను పాఠశాలల ఆవరణలో కాకుండా మైదానాలు, స్టేడియాల్లో ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. విద్యార్థుల చదువుకు ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు.