శబరిమల అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. మొత్తం ఎనిమిది ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా.. ఈ ఎనిమిది స్పెషల్ ట్రైన్లు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ వెళ్తాయి. నవంబర్ 22, 29వ తేదీల్లో 07143 నంబర్‌తో మౌలాలి(హైదరాబాద్)-కొల్లాం మధ్య ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి, అలాగే నవంబర్ 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం- మౌలాలి ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. అలాగే నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం-కొల్లాం ప్రత్యేక రైలు, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం- మచిలీపట్నం ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్ట్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. శబరిమల భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం దక్షిణ మధ్య రైల్వే కోరింది.
శబరిమల వెళ్లేవారి కోసం కడప మీదుగా ప్రత్యేక రైళ్లు
మరోవైపు శబరిమలకు వెళ్లే భక్తుల కోసం వైఎస్సా్ర్ జిల్లా కడప మీదుగా ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. కడప మీదుగా కొట్టాయం, కొల్లాంలకు నవంబరులో 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 07133 నంబరు గల ప్రత్యేక రైలు కాచిగూడలో నవంబర్ 21, 28వ తేదీల్లో మధ్యాహ్నం 3.40 గంటలకు బయల్దేరనుంది. ఈ రైలు ఆ రోజు రాత్రి 12 గంటలకు కడపకు చేరుకుంటుందని.. మరుసటి రోజు సాయంత్రం ఏడు గంటలకు కొట్టాయం చేరుకోనుంది. అలాగే 07134 నంబరుతో నవంబర్ 22, 29వ తేదీల్లో కొట్టాయం నుంచి కాచిగూడకు ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి ఈ రైళ్లు మరుసటి రోజు మధ్యాహ్వం ఒంటి గంటకు కడపకు, రాత్రి 11:40 గంటలకూ కాచిగూడకు చేరుకుంటాయి.
అలాగే 07139 నంబర్‌తో నాందేడ్ నుంచి కొల్లాం మధ్య ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే నడపనుంది. ఈ రైలు నవంబర్ 16న ఉదయం 8.20 గంటలకు నాందేడ్ నుంచి బయల్దేరనుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 2.50 గంటలకు కడపకు చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 10.30 గంటలకు కొల్లాం చేరుకుంటుందని రైల్వే అధికారులు తెలిపారు. ఇక తిరుగు ప్రయాణంలోనూ ఈ రైలు 18వ తేదీ తెల్లవారుజామున రెండున్నరకు కొల్లాంలో బయల్దేరి.. రాత్రి 11 గంటలకు కడపకు చేరుకుంటుంది. మరుసటి రోజు మధ్యాహ్నానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. వీటితో పాటుగా 07135 నంబరుతో ఈ నెల 19, 26వ తేదీల్లో నడిచే హైదరాబాద్ కొట్టాయం ప్రత్యేక రైలు కూడా కడప మీదుగా వెళ్లనుంది.